అమరావతిపై నాకెలాంటి కోపం లేదు

కట్టని రాజధాని గురించి వెయ్యిరోజుల నుంచి కృత్రిమ, రియల్ ఎస్టేట్ ఉద్యమం జరుగుతుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు.

Update: 2022-09-15 12:06 GMT

కట్టని రాజధాని గురించి వెయ్యిరోజుల నుంచి కృత్రిమ, రియల్ ఎస్టేట్ ఉద్యమం జరుగుతుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. కట్టని రాజధాని, కట్టలేని రాజధాని గురించి ఉద్యమాలా? అని ఆయన ప్రశ్నించారు. 1956 నుంచి 2014 వరకూ చంద్రబాబు ఏ ఉద్యమం చేయలేదన్నారు. ఎవరి అభివృద్ధి కోసం ఈ రాజధాని అని జగన్ ప్రభ్నించారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీ, ఓసీ కోసం ఈ రాజధాని కాదని, పెత్తందారుల కోసమేనని అన్నారు. చంద్రబాబు హయాంలో ఎందుకు సంక్షేమ పథకాలు అమలు కాలేదని ప్రశ్నించారు. లక్షా అరవై ఐదు వేల కోట్లు వివిధ పథకాల ద్వారా లబ్దిదారులకు అందించామని జగన్ తెలిపారు. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఎందుకు చంద్రబాబు ఆరోజు ఇవ్వలేదన్నారు. ఆరోజు జరిగిన దోపిడీ ఆయన అనుకూల మీడియా కూడా పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు బృందం ఆలోచనలన్నీ మా బినామీ భూముల రాజధానిగానే ఉండాలని చంద్రబాబు కోరుకున్నారని అన్నారు. పెత్తందారీ వ్యవస్థ ఎలా ఉంటుందంటే పచ్చడి అమ్మినా, చిట్‌ఫండ్ వ్యాపారం చేసినా, డిపాజిట్ల సేకరణ చేసినా మావాడే చేయాలన్న మనస్తత్వం ఉంటుందని భావించే పెత్తందారీ వ్యవస్థలో మనం ఇన్నాళ్లు బతికామని చెప్పారు. నేను నా మనుషులు మాత్రమే ఉండాలని భావిస్తారు. అన్ని వ్యవస్థలూ తన మనుషుల చేతుల్లో ఉండాలని భావిస్తారన్నారు.

చంద్రబాబు ఖర్చు చేసింది...
ఒకటే రాజధాని ఉండాలని అదే అమరావతి ఉండాలని కోరుకుంటున్నారని జగన్ అన్నారు. ప్రతిపక్ష పార్టీల్లోనూ మన మనుషులే ఉండాలన్నది చంద్రబాబు మనస్తత్వం అని అన్నారు. అమరావతి పై తనకెలాంటి కోపము లేదన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తన ఆలోచన అని అన్నారు. విజయవాడకు దగ్గరగా లేదని, ఇటు గుంటూరుకు దగ్గరగా లేదన్నారు.53 ఎకరాల అమరావతి ప్రాంతంలో రోడ్లు, నీళ్లు, డ్రైనేజీ వంటి ప్రాధమిక వసతులు కల్పించాలంటే 1,10 లక్ష కోట్లు అవుతుందని చంద్రబాబు చెప్పారన్నారు. ఐదేళ్లలో చంద్రబాబు అమరావతికి ఖర్చు చేసింది 5,675 కోట్లు మాత్రమేనని అన్నారు. రెండు వేలకోట్లు ఇంకా బకాయీలు చెల్లించకుండా వదిలేశారన్నారు. వాస్తవానికి చంద్రబాబుపై 420 కేసు పెట్టాల్సి ఉంటుందన్నారు. ఏ ప్రభుత్వమూ ఐదేళ్ల కాలంలో అంతకంటే ఎక్కువ రాజధాని నిర్మాణం కోసం పెట్టలేని పరిస్థిితి ఉందన్నారు. 80 శాతం మంది ప్రజలు తెల్లరేషన్ కార్డు మీద బతుకుతున్నారన్న విషయాన్ని పాలకులు ఎవరూ మర్చిపోకూడదన్నారు. పూర్తి స్థాయి రాజధాని కట్టాలంటే వందేళ్లు పడుతుందని జగన్ అన్నారు. అప్పటికి రాజధాని నిర్మాణ వ్యయం ఇరవై లక్షల కోట్లు అవుతుందన్నారు. ఏరకంగా ఈ రాజధానిని నిర్మిస్తామని జగన్ ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. ఈ ప్రాంతం మీద తనకు ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు.
రైతులంటే వీళ్లేనా?
రైతులంటే కేవలం అమరావతికి భూములిచ్చిన రైతులే కాదని జగన్ అన్నారు. పైగా సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అని మరో భ్రమ కల్పిస్తున్నారన్నారు. అమరావతిని డెవలెప్ చేసినా ఐదు వేల ఎకరాలకు మించి ప్రభుత్వం విక్రయించలేదన్నారు. తాను అమరావతి నుంచి రాజధానిని మారస్తున్నానని చెప్పలేదని, కర్నూలు, విశాఖలో కూడా రాజధాని ఉండాలని చెప్పానని అన్నారు. విశాఖ అంటే తనకు ప్రత్యేక ప్రేమ లేదని, రాష్ట్రంలో అతి పెద్దనగరమనే దానిని ఎంపిక చేశామని తెలిపారు. ఏ రకంగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు చెప్పాలని జగన్ ప్రశ్నించారు. అద పది వేల కోట్ల రూపాయలు విశాఖలో పెడితే ఎక్కడికో తీసుకెళతామని జగన్ తెలిపారు. విశాఖకు వెళ్లకుండా వీరు అన్ని రకాలుగా అడ్డుకున్నారన్నారు. అమరావతిలో ఎవరూ చేయలేని దాన్ని జగన్ ప్రభుత్వం చేయాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని జగన్ అన్నారు. పక్కనే ఉన్న విజయవాడకు కూడా చంద్రబాబు ఐదేళ్లలో ఏం చేయలేదన్నారు.
వికేంద్రీకరణ అవసరం...
వికేంద్రీకరణ అన్నది ఒక అవసరం అని జగన్ అభిప్రాయపడ్డారు. పరిపాలన సంస్కరణలో భాగంగా గ్రామ సచివాలయాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఊహకు కూడా ఇది తట్టలేదన్నారు. 15,004 సచివాలయాల్లో 600 సేవలు ప్రజలకు అందుతున్నాయన్నారు. 2.70 లక్షల మంది గ్రామ వాలంటీర్లు మారుమూల ప్రాంతాల్లోనూ సేవలందిస్తున్నారన్నారు. కోనసీమలో వరదలు వస్తే అందరికీ వెంటనే ప్రభుత్వం నిత్యావసరాలు అందించామంటే అదీ డిసెంట్రలైజేషన్ అని జగన్ అన్నారు. శ్రీబాగ్ ఒప్పందం నుంచి నిపుణుల కమిటీ వరకూ అభివృద్ధి అన్ని ప్రాంతాలకు చేరాలని చెప్పారని అన్నారు. ప్రాంతాల మధ్య భావోద్వేగాలు పెంచుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో 23 సీట్లు కూడా రావని ప్రాంతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నాని అన్నారు. అన్నీ ఆలోచించిన తర్వాతనే వికేంద్రీకరణ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. గ్రామ పరిపాలన నుంచి రాష్ట్ర రాజధాని వరకూ ఇదే తమ విధానమని జగన్ తెలిపారు. తాను ఈ ప్రాంతానికి వ్యతిరేకం కాదని మరోసారి చెబుతున్నానని అన్నారు.


Tags:    

Similar News