ఆ ఒక్క ప‌ని.. ఏపీ బీజేపీని ఇరికించేసిందిగా..!

Update: 2018-07-06 03:30 GMT

రాజ‌కీయంగా కొన్ని నిర్ణ‌యాలు తీవ్రంగా ఉంటాయి. ఒక్క నిర్ణ‌యం.. వంద ఫ‌లితాల‌కు దారితీస్తుంది కూడా. రాష్ట్ర విభ‌జ‌న అనే ఒక్క నిర్ణ‌యం కాంగ్రెస్‌కు కంచుకోట వంటి ఏపీలో ఆ పార్టీని భూస్థాపితం చేసేసింది. ఘోరీ క‌ట్టేసింది. నాలుగేళ్ల త‌ర్వాత కూడా ఏపీలో ఇప్ప‌టికీ ఎక్క‌డా కాంగ్రెస్ జెండా క‌నిపించ‌డం లేదు. కాంగ్రెస్ ముచ్చ‌ట వినిపించ‌డం లేదు. ఇక‌, ఇప్పుడు బీజేపీ ప‌రిస్థితి కూడా దాదాపు ఇదేలా త‌యారైంది. ఏపీకి విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల‌ను అమ‌లు చేయ‌క‌పోవ‌డం బీజేపీకి కాంగ్రెస్ క‌న్నా పెద్ద‌దెబ్బ త‌గిలేలా చేసింది. ఈ విష‌యంలో అధికార టీడీపీ, విప‌క్షాలు తీవ్ర‌స్థాయిలో బీజేపీని దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ ఇక్క‌డ బ‌తికి బ‌ట్ట‌క‌ట్టే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లోనే టీడీపీతో జ‌ట్టుక‌ట్టి అలో ల‌క్ష్మ‌ణా అనే రీతిలో మూక్కీ మూలిగీ.. నాలుగు ఎమ్మెల్యే సీట్లు, రెండు ఎంపీ సీట్లు సాధించింది. అయితే, ఇప్పుడు మ‌ళ్లీ బీజేపీ ప‌రువు గంగ‌పాలే అన్న‌ట్టుగా ప‌రిస్థితి మారిపోయింది.

వీరు ఇలా...కేంద్రం అలా...

అయిన‌ప్ప‌టికీ.. ఇక్క‌డి కాపుల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు, సామాజిక వ‌ర్గాల‌ను చెంత‌కు చేర్చుకునేందుకు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు రాష్ట్ర బీజేపీ ప‌గ్గాలు అప్ప‌గించారు. అయితే, ఇది ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో తెలియ‌దు కానీ, ఈ నేత‌లు మాత్రం.. కేంద్రం ఏపీకి ఇంకా ఏదో చేస్తుంద‌ని, చంద్ర‌బాబు చెబుతున్న మాట‌ల‌ను ఎవ‌రూ న‌మ్మ‌వ‌ద్ద‌ని చెబుతున్నారు. తాజాగా ఆ పార్టీ సీనియ‌ర్ నేత, న‌టుడు కృష్ణంరాజు కూడా మీడియా ముందుకు వ‌చ్చి.. బాబు చేస్తున్న ప్ర‌చారంపై దుమ్మెత్తి పోశారు. ఆయ‌న మాట‌ల‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌వ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. కేంద్రానికి ఏపీపై ఎలాంటి కోపం లేద‌ని చెప్పారు. రానున్న రోజుల్లో ఏపీకి ఇంకా చాలానే చేస్తుంద‌ని చెప్పుకొచ్చారు. అయితే, అనూహ్యంగా ఈ నేత‌లు ఇక్క‌డ మాట్టాడుతున్న స‌మ‌యంలోనే కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం.. దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీం కోర్టులో ఏపీకి సంబంధించి అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది.

సుప్రీంలోనే స్పష్టం చేసినా...

దీనిలో ఏపీకి విభజన చట్టంలో ఉన్నవన్నీ ఇచ్చామని, ఇక ఇచ్చేదేం లేదని కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం అధికారికంగా సుప్రీంకోర్టుకు చెప్పింది. రాజ్యసభలో ఆనాటి ప్రధాని మన్మోహన్ ఇచ్చిన హామీలను అమలు చేయలేమని కేంద్రం కోర్టుకు స్పష్టం చేసింది. అయితే ఈ అఫిడవిట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ రైల్వేజోన్ ఊసెత్తక పోవడం గమనార్హం. దుగ్గరాజపట్నం పోర్టుకు కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ అంగీకారం అంటూనే.. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం అంటూ కేంద్రం మెలిక పెట్టింది. ప్రత్యేక ప్యాకేజీ ఎంత వరకు అమలు చేశారన్న విషయాన్ని కేంద్రం వెల్లడించలేదు. ఈఏపీలపై స్పష్టంగా ప్రస్తావించలేదు. విభజన జరిగిన ఏడాది ఏపీ రెవెన్యూలోటు రూ. 4116 కోట్లు మాత్రమేనని, ఇప్పటి వరకూ 3979 కోట్లు ఇచ్చామని కేంద్రం లెక్కలు చెప్పుకొచ్చింది.

ఇంకా నమ్మించే ప్రయత్నాలు...

రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు ఇచ్చామని, యూసీలు ఇచ్చిన తరువాత మరో మూడేళ్లలో ఏడాదికి రూ. 330 కోట్ల చొప్పున వెయ్యి కోట్లు ఇస్తామని కేంద్రం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఏపీలో బీజేపీ నేత‌లు చెబుతున్న వ్యాఖ్య‌ల‌పై స‌ర్వ‌త్రా విస్మ‌యం, గంద‌ర‌గోళం వ్య‌క్త‌మ‌వుతోంది. కేంద్రంలోని బీజేపీ నేత‌లు ఏకంగా సుప్రీం కోర్టుకే ఇలా చెబుతుంటే... ఇక్క‌డ మాత్రం బీజేపీ నాయ‌కులు ప్ర‌జ‌ల‌ను న‌మ్మించేందుకు ఇంకా ఏదో చేస్తామ‌ని చెప్ప‌డం ఎందుకు? అనే ప్ర‌శ్న‌లు ఏపీ ప్ర‌జ‌ల‌ నుంచి తీవ్రంగా వ‌స్తున్నాయి. దీంతో.. కేంద్రం అఫిడ‌విట్ దాఖ‌లు చేయ‌డం ద్వారా ఏపీ బీజేపీకి ఉరి బిగించింద‌నే వ్యాఖ్య‌లు సొంత పార్టీలోని నేత‌లే అంటుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి రాబోయే రోజుల్లో ఈ అఫిడ‌విట్ మ‌రింత రాజ‌కీయ స‌మ‌స్య‌లు కొనితేవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి క‌మ‌ల‌నాథులు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Similar News