సభకు వెళ్లాలా? వద్దా?
మార్చి 7వ తేదీ నుంచి ఏపీ బడ్డెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు చంద్రబాబు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
విజయవాడ : తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా? వద్దా? అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. చంద్రబాబు మాత్రం సభకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యేలు కూడా తాము సభకు వెళ్లమని చెబుతుండటంతో వారికి చంద్రబాబు సర్దిచెబుతున్నారు. మార్చి 7వ తేదీ నుంచి ఏపీ బడ్డెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు చంద్రబాబు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
శపథం చేసి....
గత అసెంబ్లీ సమయంలో చంద్రబాబు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే సభకు వస్తానని శపథం చేసిన సంగతి తెలిసిందే. దీంతో తిరిగి ఎన్నికలు జరిగి కొత్త అసెంబ్లీ ఏర్పడేంత వరకూ చంద్రబాబు సభకు వచ్చే అవకాశం లేదు. అయితే అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు సయితం తాము సభకు దూరంగా ఉంటామని చెబుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రజా సమస్యలను సభకు వెళ్లి ప్రస్తావించాలని ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు.
ఎమ్మెల్యేలు కూడా.....
సభకు దూరంగా ఉంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ఉన్న ఎమ్మెల్యేలు సభకు వెళ్లి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించాలని, మాట్లాడేందుకు సమయం ఇవ్వకపోయినా ఆందోళనలు చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చంద్రబాబు కోరుతున్నారు. ప్రతిపక్షం లేకుండా సభ జరిగితే అది ప్రభుత్వానికి అవమానమని పలువురు ఎమ్మెల్యేలు సూచిస్తున్నారు. దీనిపై నేడో, రేపో చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.