ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. తాజాగా సింహపురి రాజకీయం వేడెక్కుతున్నట్టే కనపడుతోంది. ఈ జిల్లాలో రాజకీయంగా పట్టున్న ఆనం ఫ్యామిలీ ఇప్పుడు మరో పొలిటికల్ యూ టర్న్ తీసుకోబోతుందా ?అంటే అవుననే ఆన్సరే వస్తోంది. గత దశాబ్దకాలంగా కాంగ్రెస్‌లో మంత్రి పదవులు అనుభవించిన ఆనం సోదరులు ఆ తర్వాత గత ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ వీక్ అయినా అదే పార్టీలో ఉన్నారు. ఆనం కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.
గత ఎన్నికల తర్వాత ఆనం సోదరులు ఇద్దరూ టీడీపీలో చేరారు. చంద్రబాబు - వీరికి మధ్య ఏం ఒప్పందం జరిగిందో తెలియదు గాని ఆనం వివేక ఎమ్మెల్సీ అవుతున్నారంటూ వార్తలు వచ్చేశాయి. ఇక గతేడాది కేబినెట్ ప్రక్షాళన జరిగినప్పుడు ఆనం రామనారాయణరెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడంతో పాటు బాబు ఆయన్ను కేబినెట్‌లోకి తీసుకుని ఆర్థికశాఖ ఇచ్చేస్తారంటూ ప్రచారం జరిగింది. ఈ రెండూ జరగలేదు. జిల్లాలో ఆనం ఫ్యామిలీని పట్టించుకునే వారే లేరు.
ఆనం సోదరులు తీవ్ర అసంతృప్తితో ఉండగానే ఆనం వివేకానందరెడ్డి మృతి చెందారు. దీంతో ఆనం ఫ్యామిలీ టీడీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే టీడీపీలో ఆనం రామనారాయణరెడ్డికి కొత్తగా వచ్చే పదవులు ఏం లేవు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆత్మకూరులో ఆయన గెలిచి, పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది. అయితే అప్పటి వరకు ఆయన వెయిట్ చేయాల్సిందే.
ఇటు ఎన్నో ఆశలతో టీడీపీలోకి వస్తే తమను పట్టించుకోకపోవడంతో సోదరులు ఇద్దరూ అసంతృప్తితోనే ఉండేవారు. దివంగత వివేక ఎమ్మెల్సీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు టోటల్ ఫ్యామిలీ అంతా పార్టీ మారాలన్న నిర్ణయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఫ్యామిలీ అంతా వైసీపీలోకి వెళ్లాలని డెసిషన్ తీసుకున్నట్టు సమాచారం. కొద్ది రోజుల నుంచే ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలోకి వెళతారని వార్తలు వస్తున్నా ఆయన మాత్రం స్పందించలేదు.
ఇక తాజాగా జరిగిన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని ఆనం ఇటీవల ఆత్మకూరులో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో ఏకంగా సొంత పార్టీ నేతలపైనే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆత్మకూరు టీడీపీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఇక శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన నవనిర్మాణ దీక్షకు కూడా రామనారాయణరెడ్డి నెల్లూరులోనే ఉండి హాజరు కాలేదు. స్థానిక నేతలు కూడా పట్టించుకోకపోవడంతో ఈ దీక్ష అట్టర్ ప్లాప్ అయ్యింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రామనారాయణరెడ్డి పార్టీ మార్పుపై వేచి చూసే ధోరణిలో ఉన్నా ఫ్యామిలీ నుంచి మాత్రం ఇప్పుడే పార్టీ మారాలని....టీడీపీలో ఉండి అవమానాలు పడడం ఎందుకని ఆయనపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఆత్మకూరులో ఆనం మౌనం టీడీపీకి పెద్ద మైనస్‌గా మారింది. ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి సరిదిద్దుకోపోతే వచ్చే ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీ గెలుపు కష్టమే..!