షా...షేక్ చేస్తారా?

Update: 2018-07-13 02:30 GMT

అమిత్ షా ఎట్టకేలకు తెలంగాణకు వస్తున్నారు. ఇన్నాళ్లు తెలంగాణ నేతలు చూసిన ఎదురు చూపులు నేడు ఫలించబోతున్నాయి. అమిత్ షా ఈరోజు పాట్నా నుంచి నేరుగా బయలుదేరి ఉదయం 10.30గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పెద్దయెత్తున స్వాగతం చెప్పబోతున్నాయి. ఐదు వేల మందితో బైక్ ర్యాలీ బీజేపీ శ్రేణులు నిర్వహిస్తున్నాయి. అమిత్ షా రాకపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణలో బీజేపీ పార్టీకి పెద్ద పట్టు లేదు. కేవలం కొన్ని ప్రాంతాల్లోనే కొద్దిగా పరిమితమైన పార్టీ భారతీయ జనతా పార్టీ.

చాలా రోజుల తర్వాత....

అమిత్ షా దాదాపు ఆరు నెలల క్రితం తెలంగాణలో పర్యటించారు. నేతలకు దిశానిర్దేశం చేశారు. అయితే అమిత్ షా వెళ్లిపోయిన తర్వాత పార్టీలో గ్రూపు విభేదాలు మరింత ఎక్కువయ్యాయి. శాసనసభ పక్ష నేత కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చెరో గ్రూపుగా విడిపోయి పార్టీని పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఈ ఇద్దరి నేతలపై బహిరంగంగానే ఆరోపణలు చేశారు. నేరుగా అమిత్ షాకు లేఖ రాశారు. జిల్లాల పర్యటనలకు కూడా నిన్న మొన్నటి వరకూ శ్రీకారం చుట్టలేదు. ఇటీవలే బీజేపీ నేతలు జనంబాట పట్టారు.

ఐదు గంటల పాటు.....

ఈనేపథ్యంలో ఈరోజు అమిత్ షా నేతలకు గట్టి వార్నింగ్ ఇస్తారని తెలుస్తోంది. అస్సోం, త్రిపుర వ్యూహాలను ఇక్కడ అమలు పర్చాలని భావిస్తుంటే పార్టీలో గ్రూపు తగాదాలు ఎక్కువయ్యాయని ఇటీవల ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర బీజేపీ నేతలకు చీవాట్లు పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే దాదాపు ఐదు గంటల పాటు పార్టీ ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. బూత్ లెవెల్ కమిటీలు, శక్తి గ్రూపులు, మహాశక్తి గ్రూపుల ఏర్పాటుపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా లోక్ సభ స్థానాలపైనే అమిత్ షా ఎక్కువగా దృష్టి పెట్టనున్నారు. ఎలక్షన్ మేనేజ్ మెంట్ కోర్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు.

ముఖ్యులతో సమావేశం....

తెలంగాణలో కనీసం ఐదు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో అమిత్ షా ఉన్నారు. కరీంనగర్, సికింద్రాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, మల్కాజిగిరి ఎంపీ స్థానాలపై ఆయన కన్నేసినట్లు చెబుతున్నారు. ఇక్కడ బలమైన నేతలను ఇన్ ఛార్జిలుగా నియమించనున్నారు. అమిత్ షా తెలంగాణ పర్యటనలో కొందరు ముఖ్యులను కూడా కలవనున్నారు. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, పారిశ్రామికవేత్త శ్రీనిరాజు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ను ఆయన కలవనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మొత్తం మీద అమిత్ షా పర్యటనతో బీజేపీ రాష్ట్ర నేతలు షేక్ అవుతున్నారు.

Similar News