ఆంధ్రప్రదేశ్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తన వ్యూహాన్ని బయటపెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. ఎవరితోనూ ఏపీలో పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. ఇప్పటివరకూ బీజీపీ, వైసీపీ లాలూచీ రాజకీయాలకు పాల్పడుతున్నాయని, వైసీపీతో పొత్తు పెట్టుకునేందుకే తనను బీజేపీ ఇబ్బంది పెడుతూ వస్తుందన్న తెలుగుదేశం పార్టీ ఆరోపణలను అమిత్ షా పరోక్షంగా ఖండించారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులుండవని చెప్పేశారు.
రాజధాని నిర్మాణం ఎక్కడ?
ఇక చంద్రబాబు ఇప్పటి వరకూ కేంద్రంపై చేస్తున్న ఆరోపణలకు కూడా ఆయన సూటిగా సమాధానాలివ్వడం విశేషం. రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వడం లేదని చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ 2100 కోట్ల రూపాయలను నిధులను ఇచ్చిందన్నారు. కాని వాటిని రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేయలేదని తీవ్ర విమర్శలు చేశారు.
నిధులకు లెక్కలేవీ?
ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పకపోతే ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తుందని ప్రశ్నించారు. రాజధానికోసం వేల కోట్లు నిధులిచ్చినా ఒక్క భవనానికి కూడా ఇప్పటి వరకూ టెండర్ పిలవకపోవడం ఏంటని నిలదీశారు. రాజధాని నిర్మాణం కోసం రూపొందించిన డిజైన్లన్నీ ఇప్పటికీ సింగపూర్ వద్దనే ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. లెక్కలు చెప్పకుండా కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం బాబుకు తగదని అమిత్ షా చెప్పారు.
త్వరలోనే ఏపీ పర్యటన......
ఇక అమిత్ షా త్వరలోనే ఆంధ్రప్రదేశ్ పర్యటన ఉంటుంది. ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణను నియమించారు. అలాగే రామ్ మాధవ్ పార్టీ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. త్వరలోనే అమిత్ షా ఏపీకి వచ్చి పార్టీ బలోపేతం పై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ప్రధానంగా పార్లమెంటు స్థానాలపైనే ఏపీలో ఎక్కువగా ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఇప్పటి వరకూ చంద్రబాబు విమర్శలను పెద్దగా పట్టించుకోని బీజేపీ ఇకపై ఎదురుదాడికి దిగాలని నిర్ణయించింది.