అమరరాజా.. ఎవరికి నష్టం.. జగన్ కా? గల్లాకా?

అమరరాజా సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయింది. దీనిపై విమర్శలు వినిపిస్తున్నాయి

Update: 2022-12-03 06:53 GMT

అమరరాజా సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయింది. 9,500 కోట్ల పెట్టుబడితో అమరరాజా సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది జగన్ సర్కార్ కు ఝలక్ ఇవ్వడానికేనా? రాష్ట్రంలో పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రం వైపు చూస్తున్నాయని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకేనా? అన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది. నో డౌట్.. జగన్ ను దెబ్బకొట్టడానికే అమరరాజా సంస్థ తన పెట్టుబడులను పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టేందుకు సిద్ధమయింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.


వేధింపులకు దిగడంతోనే...

అమరరాజా సంస్థపై జగన్ ప్రభుత్వం వేధింపులకు దిగడంతో పాటు నోటీసులు జారీ చేయడం, జరిమానాలు విధించడం వంటి వాటితో ఆ సంస్థ విసిగిపోయిందన్నది తెలిసిందే. పొరుగున ఉన్న తమిళనాడుకు వెళ్లాలని కూడా అమరరాజా సంస్థ ప్రయత్నించింది. అయితే ఏమయిందో ఏమో గాని తెలంగాణలో ఏర్పాటుకు సిద్ధమయింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు తక్కువగా వస్తున్నాయని, ఉన్న పరిశ్రమలు వెనక్కు వెళ్లిపోతున్నాయన్న విమర్శలు బాగానే వినిపిస్తున్నాయి. సంక్షేమం పెట్టే దృష్టి జగన్ పరిశ్రమల స్థాపనపై పెట్టడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనికి తోడు ఉన్న పరిశ్రమలు కూడా కొన్ని రాష్ట్రం నుంచి వెళ్లిపోవడంతో జగన్ సర్కార్ ను ఇరకాటంలోకి పడేసేదే. నిజమే.. అమరరాజా కంపెనీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినా జగన్ ప్రభుత్వం సహకరిస్తుందా? లేదా? అన్న అనుమానం వారికి ఉండటంలో తప్పు లేదు.
ప్రభుత్వంపై కోపంతో....
అలాగని తమకు రాజకీయంగా, పారిశ్రామికంగా చేయూత నిచ్చిన రాష్ట్రాన్ని వదిలి ప్రభుత్వంపై కోపంతో ఎలా పొరుగు రాష్ట్రానికి వెళతారన్న విమర్శలు కూడా ఆ కంపెనీతో పాటు గల్లా కుటుంబం కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది. చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న అమరరాజా సంస్థ తన తదుపరి విస్తరణను తెలంగాణను ఎంచుకోవడంపై అనేక కామెంట్స్ వినపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగానే ఆ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయిందని విపక్షాలు విమర్శిస్తుంటే.. జగన్ ను ప్రజల్లో పలుచన చేయడానికే ఈ నిర్ణయం తీసుకుందని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ కంపెనీ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ కుటుంబానిది. టీడీపీ ఎంపీ కుటుంబానికి చెందిన కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడమేంటన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. రేపు టీడీపీ అధికారంలోకి వస్తే అప్పుడు మళ్లీ తెలంగాణలో కాదని ఆంధ్రప్రదేశ్ కు వస్తారా? ఆ అవకాశం ఉంటుందా? అన్న ప్రశ్న తలెత్తుతుంది.

రాజకీయంగా అవకాశమిచ్చిన....
ప్రభుత్వంపై ఆగ్రహంతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు నిర్వహిస్తున్న ఆ కుటుంబం తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంపై ఏపీ పట్ల ఉన్న ప్రేమను చాటి చెబుతుందన్న వారు కూడా లేకపోలేదు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. కానీ పరిశ్రమలు స్థాపించడం ద్వారా ఏపీ యువతకుఉపాధి కల్పించే కార్యక్రమానికి అమరరాజా సంస్థ నీళ్లొదిలిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏపీ ప్రజల ఓట్లు కావాలి కాని, పెట్టుబడులు మాత్రం పక్క రాష్ట్రంలో పెడతామంటే ప్రజలు అంగీకరిస్తారా? అది గల్లా కుటుంబానికి సరైనదేనా? అన్న ప్రశ్నలు వినపడుతున్నాయి. ప్రభుత్వంతో విభేదాలుంటే న్యాయపరంగా పోరాడాలి సాధించుకోవాలి గాని, జగన్ పై కోపంతో కోట్లాది రూపాయల పెట్టుబడులను ఇతర రాష్ట్రంలో పెట్టడంపై కామెంట్స్ వినపడుతున్నాయి. మొత్తం మీద గల్లా కుటుంబం నిర్ణయం ఇటు జగన్ కు మాత్రమే కాకుండా ఆ కుటుంబానికి, టీడీపీని కూడా డ్యామేజీ చేసే విధంగా ఉందనడంలో సందేహం లేదు.


Tags:    

Similar News