ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియకు పదవీ గండం పట్టుకుందా? ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించేందుకు ముహూర్తం సిద్ధమవుతోందా? సీఎం చంద్రబాబు ఆమెపై గుర్రుగా ఉన్నారా? అంటే తాజా పరిణామాలు ఔననే అంటున్నాయి. ఎన్నో ఆశలతో.. ఎన్నెన్నో ఆకాంక్షలతో చంద్రబాబు అఖిల ప్రియకు మంత్రి పదవిని కట్టబెట్టారు. ముఖ్యంగా పార్టీని సమన్వయం చేసుకుని, కర్నూలులో పొగొట్టుకున్న గత పరువును తిరిగి పార్టీకి సమీకరించి పెడతారని, అత్యంత కీలకమైన పర్యాటక రంగాన్ని ఆమె ముందుండి నడిపిస్తారని చంద్రబాబు భావించారు. అయితే, ఆయన ఆశలు అడియాశలయ్యాయని, బాబు వేగాన్ని ఆమె అందుకోలేక పోతున్నారని, అంతే కాకుండా మంత్రి పదవి చేపట్టి మూణ్నాళ్లు కూడా కాకుండానే ఆమె బాబును లెక్కచేయని స్థితికి వెళ్లిపోయిందనే వార్తలు టీడీపీ, ప్రభుత్వ వర్గాల్లోనే ఉన్నాయి.
బాబు మాటనే లెక్కచేయడం లేదా..?
ఆమె శాఖలో పోలవరం, విజయవాడలో పవిత్ర సంగమం వద్ద ఇలా పదే పదే ప్రమాదకర సంఘటనలు జరుగుతున్నా ఆమె సీరియస్‌గా చర్యలు తీసుకోవడం కానీ, ప్రమాదాలపై ఫాలోఅప్ చేసిన తీరు కానీ చంద్రబాబుకు ఏ మాత్రం నచ్చలేదు. ఇక పార్టీ సీనియర్ నాయకుడు ఏవి.సుబ్బారెడ్డి విషయంలో చంద్రబాబు తగ్గమన్నా ఆమె దూకుడుగా ముందుకు వెళ్లడం... అవసరమైతే వైసీపీలోకి వెళతానన్న సంకేతాలు వదలడం కూడా ఆమె ప్రవర్తన ఎలా ఉందో చెప్పకనే చెప్పేశాయి. అంతేకాకుండా, టీడీపీలో ఉంటూ.. వైసీపీ నాయకులకు ఇతోధికంగా సాయం చేస్తున్నారనేది మరింత ప్రమాదకరమైన పరిణామంగా మారాయి. దీంతో అఖిలను ఇంటికి పంపించేందుకు సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ సిద్దం చేసుకున్నారన్న సందేహాలే ఇప్పుడు టీడీపీలో వినిపిస్తున్నాయి.
శాఖపైన పట్టు సాధించలేక...
విషయంలోకి వెళ్తే.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి 2014లో వైసీపీ తరఫున పోటీ చేసిన భూమా శోభ ఆకస్మిక మరణంతో ఆమె కుమార్తెగా రంగంలోకి దిగి అక్కడ జరిగిన ఉప ఎన్నికలో ఏకగ్రీవ విజయం సాధించారు అఖిల ప్రియ. అయితే, రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆమె తన తండ్రి భూమా నాగిరెడ్డితో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పట్లో పార్టీ మారే సమయంలోభూమాకు మంత్రి పదవిని ఇస్తానన్న చంద్రబాబు.. ఆయన ఆకస్మిక మరణంతో ఆ పదవిని అఖిలకు కట్టబెట్టారు. ఇలా తల్లి మరణంతో ఎమ్మెల్యేగా, తండ్రి మరణంతో మంత్రిగా ప్రజల్లోకి వచ్చిన అఖిల.. అనతికాలంలోనే చెడ్డపేరు తెచ్చుకున్నారు. శాఖపై పట్టులేకపోవడం ప్రధాన లోపం. అదేవిధంగా శాఖ కార్యకలాపాలపై నిఘా లేకపోవడం, అధికారులను అప్రమత్తం చేయలేక పోవడం వంటివి ఆమెకు మంత్రిగా మైనస్ గా మారిపోయాయి.
బాబు చెప్పినా పంథా మార్చుకోకుండా...
ఈ క్రమంలోనే కృష్ణానదిలో జరిగిన ప్రమాదం.. 23 మంది యాత్రికుల మరణం, గోదావరిలో బోటు మునక 15 మంది మరణం వంటివి ఆమె విధుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారాయి. ఇక, కర్నూలులో పార్టీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డితో ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో రాజకీయాలు చేయడం, అవి కాస్తా రాజధాని అమరావతి వరకు పాకడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అందరినీ కలుపుకొని పోవాలని, సీనియర్లకు విలువ ఇవ్వాలని చంద్రబాబు పదే పదే అఖిలకు హితవు పలికారు. కానీ, ఆమె తన పంథా మార్చుకోలేదు. ఇక తనకు వరుసకు మామ అయిన బనగానపల్లె వైసీపీ ఇన్‌చార్జ్ కాటసాని రామిరెడ్డికి ఆమె కాంట్రాక్టులు ఇచ్చారన్న అభియోగాలు ఉన్నాయి. దీనిపై బనగానపల్లె టీడీపీ ఎమ్మెల్యే జనార్థన్‌రెడ్డి నేరుగా చంద్రబాబుకే ఫిర్యాదు చేశారు.
ముహూర్తం కోసమే ఎదురుచూస్తున్నారా..?
ఇక జిల్లాలో సీనియర్లు అయిన డిప్యూటీ సీఎం కే.ఈ.కృష్ణమూర్తితో పాటు నంద్యాల ఎంపీ ఎస్పీవై.రెడ్డితోనూ ఆమెకు సఖ్యత లేదు. ఏకచక్రాధిపత్యంగా ముందుకు వెళ్లాలన్న ఆమె నిర్ణయాలే ఆమెను అందరికి దూరం చేస్తున్నాయి. చంద్రబాబు చెప్పినా ఆమె బాబునే లెక్కచేయనట్టుగా వ్యవహరించడం కూడా చాలా మందికి రుచించడం లేదు. దీంతో తీవ్ర అసహనానికి గురై ఆమెను పదవి నుంచి తప్పించడమే కరెక్ట్ అని నిర్ణయానికి వచ్చారు. అయితే, ఇప్పటికిప్పుడు తప్పించడం ద్వారా పార్టీకి చెడ్డ పేరు వస్తుందని భావించిన ఆయన ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు.
విస్తరణలో పక్కనపెట్టేస్తారా....
త్వరలోనే రాష్ట్ర కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరించనున్నారనే వార్తల నేపథ్యంలో అఖిల సీటును ఖాళీ చేయిస్తారని అంటున్నాయి అమరావతి వర్గాలు. బీజేపీ మంత్రులు ఇద్దరు రాజీనామాలతో ఖాళీ అయిన ప్లేస్‌లలో ఒకదానిని మైనార్టీ వర్గానికి చెందిన షరీఫ్‌తో భర్తీ చేస్తారని అంటున్నారు. మరో బెర్త్‌ను ఎస్టీలకు ఇవ్వవొచ్చని కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అఖిలను తప్పిస్తే అదే ప్లేస్‌లో సీమ వర్గానికే రెడ్డి ఎమ్మెల్యేకే ఈ బెర్త్ ఇవ్వవొచ్చన్నది కూడా అమరావతిలో నడుస్తోన్న చర్చ. ఎవరెన్ని చెప్పినా, భూమా, శోభ సానుభూతి ఉన్నా చంద్రబాబు అఖిల విషయంలో మానసికంగా ఓ డెసిషన్‌కు వచ్చేసినట్టు కనపడుతోంది. ఇదే విషయాన్ని పార్టీ సీనియర్లు కూడా చెబుతుండడం గమనార్హం.