జగ్నూ .. కామెడీ అనుకున్నాం... మ్యాజిక్ చేశావుగా?

పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. అయితే ఇక్కడ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ పదవీ బాధ్యతలను చేపట్టబోతున్నారు

Update: 2022-03-10 07:52 GMT

పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. అయితే ఇక్కడ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ పదవీ బాధ్యతలను చేపట్టబోతున్నారు. పదేళ్ల రాజకీయ ప్రయాణంలోనే భగవంత్ మాన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నారు. అన్ని పార్టీలకు చెందిన ముఖ్యమంత్రి అభ్యర్థులు ఓటమి దశలో ఉన్నా భగవంత్ మాన్ మాత్రం ముందంజలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ సయితం భగవంత్ మాన్ విప్లవం సృష్టించారని ట్వీట్ చేయడం విశేషం.

కమెడియన్ గా...
నిజానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టబోతున్న భగవంత్ మాన్ కమెడియన్ గా పంజాబ్ ప్రజలకు సుపరిచితుడు. 1992లో ఆయన క్రియేటివ్ మ్యూజిక్ కంపెనీలో షోలు చేసి ప్రజలకు చేరువయ్యారు. 2012 ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన పంజాబ్ పీపుల్స్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత భగవంత్ మాన్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో సంగ్రూర్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు.
ఆప్ ను బలోపేతం చేయడంపై...
ఆయన రాజకీయాల్లోకి వచ్చి పదేళ్లే అయింది. అయితే పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీని బలోపేతం చేయడానికి శ్రమించారు. గత ఎన్నికల్లోనూ ఆప్ కు 20 అసెంబ్లీ స్థానాలు రావడంతో అధికారం చేజిక్కించుకునే దిశగా అరవింద్ కేజ్రీవాల్ సయితం పంజాబ్ పై ఫోకస్ పెట్టారు. అయితే ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించడం కోసం కేజ్రీవాల్ ప్రజాభిప్రాయాన్ని కోరారు. టెలి ఓటింగ్ ద్వారా అభిప్రాయాన్ని సేకరిచారు. ఈ అభిప్రాయ సేకరణలో ఎక్కువ శాతం మంది భగవంత్ మాన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కోరుకున్నారు.
ముఖ్యమంత్రి అభ్యర్థిగా....
వెంటనే భగవంత్ మాన్ ను కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. భగవంత్ మాన్ ను దగ్గరి వారు జగ్నూ గా పిలుస్తారు. పంజాబ్ ప్రజలకు బలమైన హామీలు ఇచ్చారు. ఢిల్లీ రాష్ట్రంలో అమలువుతున్న పథకాలన్నీ పంజాబ్ కు తెస్తామన్నారు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించింది. పంజాబ్ కు కొత్త ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ఎన్నిక కాబోతున్నారు. పదేళ్ల రాజకీయ ప్రయాణంలోనే అతి పెద్ద పదవిని చేపట్టబోతున్నారు.


Tags:    

Similar News