40 సెకన్ల...ఆ... ఆడియో....బీజేపీ...టీఆర్ఎస్ వార్

Update: 2017-10-09 08:30 GMT

నిజామాబాద్ పట్టణంలో బీజేపీ, టీఆర్ఎస్ వార్ స్టార్ట్ అయింది. సోషల్ మీడియా వేదికగా గత కొద్ది రోజులుగా నడుస్తున్న ఈ యుద్ధం పోలీస్ స్టేషన్ల వరకూ వెళ్లింది. నిజామాబాద్ జిల్లా అర్బన్ సీటుపై కన్నేసిన కమలం నేతలు పట్టణంలో పట్టు మరోసారి నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ కూడా నిజామాబాద్ అర్బన్ ప్రాంతంలో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో కమలానికి, కారు పార్టీకి మధ్య వివాదం తలెత్తింది. నిజామాబాద్ పట్టణ ఎమ్మెల్యే గణేష్ గుప్తాపై ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఆడియోను కమలం పార్టీ కార్యకర్తలే పెట్టారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరులు ఆందోళనకు దిగారు.

ఎమ్మెల్యే బెదిరిస్తున్నారంటూ......

టీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఒక కార్యకర్తను బెదిరించినట్లు ఈ ఆడియోలో ఉంది. కమలం పార్టీ కార్యకర్తను బెదిరిస్తూ ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆడియోను సోషల్ మీడియాలో కొందరు పోస్ట్ చేశారు. దీనిపై ఎమ్మెల్యే గణేష్ గుప్తా పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో కమలం పార్టీ కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. తమ పార్టీ కార్యకర్తను బెదిరించడమే కాకుండా... తిరిగి అరెస్ట్ చేస్తారా? అంటూ ఆందోళనకు దిగారు. బీజేపీ నేతలు కూడా ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేశారు. దీంతో నిజామాబాద్ పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 40 సెకన్ల నిడివి ఉన్న ఈ ఆడియో నిజామాబాద్ పట్టణంలో ప్రకంపనలు రేపుతోంది.

Similar News