26న ఏపీకి అమిత్ షా : పార్టీ బలోపేతమే లక్ష్యం!

Update: 2016-11-19 09:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నాలు వారు మరింతగా పెంచుతున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈనెల 26న రాష్ట్రానికి రానున్నారు. తాడేపల్లి గూడెంలో ఆయన బహిరంగ సభలో మాట్లాడుతారు. ప్రత్యేక ప్యాకేజీతో పాటూ ఏపీ అభివృద్ధికి కేంద్రం ఎంత పాటుపడుతున్నదో ఆయన వివరించే ప్రయత్నం చేస్తారు. ప్రధానంగా అన్నదాతల సంక్షేమాన్ని ఉద్దేశించి.. ఈ సభ జరుగుతోంది.

ఈ విషయాన్ని పార్టీ నాయకురాలు పురందేశ్వరి ప్రకటించారు. నోట్ల రద్దు వలన వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం గుర్తించింది అని పురందేశ్వరి అంటున్నారు గానీ.. ఆ సమస్యలను తీర్చడానికి కేంద్రం ఏం నిర్ణయాలు తీసుకుంటున్నది, సహకార బ్యాంకుల విషయంలో విధానం మారుస్తున్నదా లేదా అనే విషయాలుచెప్పడం లేదు.

అయితే తాడేపల్లి గూడెంలో నిర్వహించే బహిరంగ సభ రైతు సమస్యల పరిష్కారానికి ఉద్దేశించినదని పురందేశ్వరి చెబుతున్నారు. అయితే రైతులకు సమస్యలు కేంద్రప్రభుత్వం వల్ల ఎదురవుతున్నాయని సభలో మాట్లాడతారా? రాష్ట్రప్రభుత్వం వల్ల ఎదురవుతున్నాయని మాట్లాడుతారా? సమస్యల పరిష్కరించడానికి సంబంధించి ఎవరిని నిందిస్తారు? అయినా రైతు సమస్యల పరిష్కారానికి అంటూ పాలకపక్షంలోని పార్టీ సభ పెట్టడమే చిత్రమైన పరిణామం కాగా.. తాడేపల్లి గూడెం సభలో అమిత్ షా ఏమీ అనకపోయినా.. లోకల్ నాయకులు చంద్రబాబు సర్కారు మీద విమర్శలు చేయడం జరగవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.

Similar News