అత్త తిట్టినందుకు కాదు....తోడికోడలు నవ్వినందుకు అన్న సామెత గుర్తుంది కదా...ఇది రాజస్థాన్ కమలం నేతలకు భేషుగ్గా వర్తిస్తుంది. రాజస్థాన్ బీజేపీ నేతలు దిగాలు పడుతున్నారు. రాజస్థాన్ లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలయిన సంగతి తెలిసిందే. అజ్మీర్, అల్వార్ లోక్ సభ సిట్టింగ్ స్థానాలతో పాటుగా మందల్ ఘర్ అసెంబ్లీ స్థానంలో కూడా ఘోరంగా పరాజయం పాలవ్వాల్సి వచ్చింది. అయితే మూడు స్థానాలు కోల్పోయిన బాధ కంటే కొన్ని ప్రాంతాల్లో వచ్చిన ఓటింగ్ శాతం వారిని కలవరపరుస్తోంది. ఎప్పుడూ...ఎన్నడూ జరగని విధంగా ఓటర్లు చావు దెబ్బకొట్టడంపై పార్టీ విశ్లేషణలు చేస్తోంది. ఇందుకు గల కారణాలను అన్వేషిస్తుంది.
ఒక బూత్ లో సున్నా...
రెండు...ఒకటి...సున్నా....ఈ సంఖ్యలు బీజేపీ నేతలను వేధిస్తున్నాయి. ఊహించని విధంగా ఒక పోలింగ్ బూత్ లో రెండు ఓట్లు, మరో పోలింగ్ బూత్ లో ఒక ఓటు, మరో పోలింగ్ బూత్ లో బోణీ కూడా చేయకపోవడంపై బీజేపీలో అంతర్మధనం ప్రారంభమైంది. ఉప ఎన్నికల్లో ఈ పోలింగ్ కేంద్రాల్లో వచ్చిన ఓట్లు చూసి బీజేపీ నేతలు ఖిన్నులయ్యారు. అజ్మీర్ లోక్ సభ పరిధిలో మొత్తం 8 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో ఒకటి అజ్మీర్ జిల్లాలో ఉండగా, మరొకటి జైపూర్ లోఉంది. అయితే ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థి వెనకబడి పోవడం వారికి షాక్ కు గురి చేసింది.
ఎందుకిలా జరిగింది?
నజీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నెం 223లో బీజేపీకి ఒక్క ఓటు రాగా, కాంగ్రెస్ కు 582 ఓట్లు వచ్చాయి. అలాగే పక్కనే ఉన్న 224 పోలింగ్ కే్ంద్రంలో బీజేపీకి రెండు ఓట్లు రాగా, కాంగ్రెస్ కు 500 ఓట్లు వచ్చాయి. అలాగే దూధూ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం 49లో ఆశ్చర్యకరంగా సింగిల్ ఓటు కూడా అధికార పార్టీ అయిన బీజేపీకి రాకపోవడం విశేషం. ఇక్కడ కాంగ్రెసె కు 337 ఓట్లు రావడం గమనార్హం. ఈ పోలింగ్ కేంద్రంలో బీజేపీ పోలింగ్ ఏజెంట్ కూడా తన ఓటును వేయలేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఫలితాలు బీజేపీ నేతలను బాధిస్తున్నాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో రెండున్నర లక్షలకు పైగా వచ్చిన ఓట్లు ఇప్పుడు ఏమయిపోయాయన్న ఆందోళనలో బీజేపీ నేతలు ఉన్నారు. బీజేపీ నేతలు ఈ 2...1...0 ఓట్లు షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు. మరో పదినెలల్లో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఈ ఫలితాలతో బీజేపీ నేతలు డీలా పడ్డారు. ఈ ఫలితాలకు గల కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు నేతలు.