14 మందిని మింగేసిన కృష్ణ‌మ్మ‌... ప్రమాదానికి అస‌లు కార‌ణం ఇదే

Update: 2017-11-12 15:29 GMT

ఏపీలోని కృష్ణా జిల్లా విజ‌య‌వాడ సమీపంలోని ఇబ్ర‌హీంప‌ట్నం వ‌ద్ద ఫెర్రీ ఘాట్ వ‌ద్ద ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు అందుతోన్న స‌మాచారం ప్ర‌కారం 14 మంది ప‌ర్యాట‌కులు మృతిచెందారు. బోటులో మొత్తం 38 మంది ఉండ‌గా, గ‌ల్లంతైన 9 మంది ప్ర‌యాణికుల కోసం పెద్దెత్తున గాలింపు చ‌ర్య‌లు జ‌రుగుతున్నాయి. ఇక ఈ దారుణ ప్ర‌మాద సంఘ‌ట‌న పూర్తి వివ‌రాల్లోకి వెళితే ఇలా ఉన్నాయి.

కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీ ఘాట్‌ వద్ద కృష్ణా నదిలో ప్రయాణికులతో వెళ్తున్న బోటు బోల్తా పడింది. మృతుల్లో ఏడుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. బోటు తిరగబడిన సమయంలో అందులో సుమారు 38 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్ర‌మాదంలో రెస్యూ టీం 15 మందిని ర‌క్షించారు. మిగిలిన వారి కోసం గాలింపు చ‌ర్య‌లు ముమ్మరంగా సాగుతున్నాయి. చీక‌టి ప‌డ‌డంతో పాటు చ‌లి ఎక్కువుగా ఉండ‌డంతో ఈ గాలింపు చ‌ర్య‌లు కాస్త లేట్ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

ప్ర‌కాశం జిల్లా ఒంగోలుకు చెందిన వాక‌ర్స్ క్ల‌బ్ స‌భ్యులు కార్తీక‌మాసం కావ‌డంతో విజ‌య‌వాడ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. వీరు బోటులో భ‌వానీ ఐలాండ్ వెళ్లి తిరిగి వ‌స్తూ ఫెర్రీ ఘాట్ వ‌ద్ద ప‌విత్ర కృష్ణా హార‌తిని సంద‌ర్శించాల‌ని అనుకున్నారు. అయితే బోటులో ఉన్న‌వారిలో 32 మంది ఒంగోలు వాసులు కాగా, 6 గురు నెల్లూరు జిల్లా వాసులు ఉన్నారు. ప్ర‌భుత్వం భ‌వానీద్వీప సంద‌ర్శ‌న‌కు కొంద‌రికి ప‌ర్యాట‌క బోట్ల‌కు అనుమ‌తి ఇచ్చింది. అయితే వీరు ఎక్కిన బోటు సామ‌ర్థ్యానికి మించి ప‌ర్యాట‌కుల‌ను ఎక్కించుకోవ‌డంతో బోటు ఫెర్రీ వ‌ద్ద మ‌లుపు తిరుగుతుండ‌గా అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది.

ప్ర‌మాదానికి కార‌ణాలు ఇవే...

ఈ ప్ర‌మాదం జ‌ర‌గ‌డానికి బోటు డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మ‌ని బ‌తికి భ‌య‌ట‌ప‌డిన ప‌ర్యాట‌కులు చెపుతున్నారు. ప‌రిమితికి మించి ప‌ర్యాట‌కుల‌ను బోటులో ఎక్కించుకోవ‌డం, వీరిలో ఎక్కువ మంది ఒకే వైపున‌కు కూర్చోవ‌డంతో ఫెర్రీ ఘాట్ వ‌ద్ద మ‌లుపు తిరుగుతోన్న టైంలో బోటు బోల్తా ప‌డి దానికిందే చాలా మంది ఇరుక్కుపోయి ఊపిరాడ‌క మృతిచెందారు. ఇక మృత్యుంజయులైన ప‌ర్యాట‌కులు చెపుతోన్న దాని ప్ర‌కారం బోటు డ్రైవ‌ర్ తాము ఎంత కోరిన లైఫ్ జాకెట్లు ఇవ్వలేదని, పదేపదే అడుగుతున్న పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. దీంతో బోటు ఓ మ‌ట్టిదిబ్బ‌ను ఢీ కొట్ట‌డంతో ఓ వైపున‌కు ఒంగిపోయింద‌ట‌. దీంతో ప్ర‌యాణికులు ఒక్క‌సారిగా ఒకే వైపున‌కు రావ‌డంతో బోటు ఒంగి ప‌క్క‌కు రావ‌డంతో ప్ర‌యాణికులంతా న‌దిలో మునిగిపోయారు. మ‌రో షాక్ ఏంటంటే ప్ర‌మాదానికి గురైన బోటుకు ఎలాంటి అనుమ‌తులు లేవ‌ని అధికారులు ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో తేలింది. పర్యాటకుల కోసం బోటు నిర్వాహకులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదని గుర్తించారు. రివర్‌బే సంస్థ తొలిసారిగా ఇవాళే రాయపూడి నుంచి పవిత్ర సంగమం వరకు బోట్‌ షికారు కోసం ట్ర‌య‌ల్ ర‌న్ నిర్వ‌హించ‌గా, తొలి బోటే ప్ర‌మాదానికి గుర‌వ్వ‌డం దారుణం.

Similar News