మృత్యువులోనూ వీడని స్నేహం

మహబూబ్ నగర్ జిల్లాలో ఓ ఇద్దరు అమ్మాయిలు వాగు దాటుతుండగా మృత్యువాత పడడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు..

Update: 2023-07-25 13:30 GMT

mahabubnagar kondedu vaagu

స్నేహాని కన్నా మిన్న ఈ లోకాన మరేదీ లేదంటారు. ప్రతి ఒక్కరు తమ బాధ, సంతోషాన్ని కేవలం స్నేహితులతో మాత్రమే ఎలాంటి బెరుకు లేకుండా పంచుకుంటారు. అలాంటి స్నేహమే వీరిది కూడా. వారిద్దరూ కలిసిమెలిసి ఊరంతా తిరిగేవారు. పక్కపక్క ఇళ్లలో నివసించేవారు. ఎక్కడికి వెళ్లినా జంటగా వెళ్లేవారు. ప్రకృతికి సైతం వారి స్నేహాన్ని చూసి కన్ను కుట్టిందో ఏమో. వాగు రూపంలో ఆ ఇద్దరినీ మృత్యువు కబళించింది. చావు కూడా వారి స్నేహాన్ని విడదీయలేకపోయింది. ఇద్దరు స్నేహితురాళ్లు ఒకేసారి మరణించడంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

మహబూబ్ నగర్ జిల్లాలో ఓ ఇద్దరు అమ్మాయిలు వాగు దాటుతుండగా మృత్యువాత పడడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో.. ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు, అధికారులు ఎవరూ ఇళ్లనుంచి బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. జడ్చర్ల మండలంలో ఉన్న కొండెడు గ్రామానికి చెందిన స్వాతి (18), అనూష (17) ఇద్దరు అమ్మాయిలు కలిసి పొలంలో కలుపు తీయడానికి వెళ్తున్న సమయంలో తూర్పు వాగు దాటుతుండగా.. వరద ప్రవాహం ఎక్కువైంది. దాంతో ఒక్కసారిగా ఇద్దరు అమ్మాయిలు అదుపుతప్పి వాగులో గల్లంతయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు, గ్రామస్తులు వాగు వద్దకు చేరుకున్నారు. ఇద్దరి ఆచూకీ కోసం గాలించగా.. గల్లంతైన ప్రాంతం నుంచి అర కిలోమీటర్ దూరంలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు గ్రామస్తుల సహకారంతో అమ్మాయిల మృతదేహాలను వాగులో నుండి వెలికి తీశారు. ఇద్దరు అమ్మాయిలు మృతి చెందడంతో రెండు కుటుంబాలతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎప్పుడూ కలిసిమెలిసి ఉండే స్వాతి, అనూషలను మృత్యువు కూడా వేరుచేయలేకపోయిందంటూ బంధువులు రోధిస్తున్న తీరు గ్రామస్తులను కూడా కంటతడి పెట్టించింది.


Tags:    

Similar News