Telangana : గుడ్ న్యూస్.. ఇక వారి ఖాతాల్లో లక్ష రూపాయల నగదు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ల రెండు నెలలు దాటి పోయింది.

Update: 2026-01-24 05:16 GMT

మాఘమాసం మొదలవుతుంది. అంటే పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ల రెండు నెలలు దాటి పోయింది. అయితే ఇప్పటి వరకూ కల్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేయలేదు. ఈ మాఘమాసంలో జరిగే పెళ్లిళ్లకయినా కల్యాణ లక్ష్మి పథకం కింద నగుదు చెల్లింపు చేస్తారా? అన్న ప్రశ్నకు అవుననే సమాధానం వస్తుంది. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండటంతో ప్రధానమైన హామీని నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే కేవలం ఈ పథకం కింద గత ప్రభుత్వంలో ఇచ్చిన లక్ష రూపాయల నగదు మాత్రమే చెల్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కసరత్తులు మొదలు...
ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలిసింది. ఆరు గ్యారంటీలలో ఒకటయిన కల్యాణ లక్ష్మి కోసం చాలా మంది నిరుపేదలు ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. కల్యాణ లక్ష్మితో పాటు షాదీముబారక్ పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. నిధుల కొరత కారణంగానే ఇప్పటి వరకూ ఈ పథకాన్ని అమలు చేయలేకపోయింది. ఇక రెండేళ్లు దాటడంతో ఈ మాఘమాసంలో పెళ్లిళ్లు చేసుకునే నిరుపేదలైన కుటుంబానికి లక్ష రూపాయలను ఈ పథకం కింద చెల్లించనున్నట్లు సమాచారం. అయితే గత ప్రభుత్వం విధించిన నిబంధనలు మాత్రమే ఇప్పుడు కూడా అమలు చేయాలని ఈ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
అవే అర్హతలు...
కల్యాణ లక్ష్మి పథకం పేరును కల్యాణమస్తుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు వాగ్దానమిచ్చినట్లుగా తులం బంగారం ఇవ్వాలంటే సాధ్యం కాదని, అయితే లక్ష రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చినట్లే ఇవ్వాలా? లేకుంటే మరో పాతికవేలు అదనంగా కలిపి ఇవ్వాలా? అన్న దానిపై ముఖ్యమంత్రి విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశముందని చెబుతున్నారు. మాఘమాసం ఫిబ్రవరి నెల నుంచి మొదలవుతుండటంతో అప్పటి నుంచి పెళ్లిళ్లు చేసుకున్న వారికి మాత్రమే ఈ పథకం వర్తించేలా నిబంధనలను రూపొందిస్తున్నారు. అంతే తప్ప గతంలో పెళ్లిళ్లు చేసుకున్న వారికి ఈ పథకం వర్తించకపోవచ్చు. అయితే దీనిపై ఇంకా ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.


Tags:    

Similar News