Telangana : లోకల్ లో జనం "హ్యాండ్" ఇస్తారా? అండగా నిలబడతారా?
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై జనాభిప్రాయం తెలిపే ఎన్నికలు త్వరలో జరగనున్నాయి
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై జనాభిప్రాయం తెలిపే ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి, ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారన్న దానిపైనే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పబోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండేళ్లు దాటి పోయింది. ఈ రెండేళ్లలో ఒకే ఒక ఉప ఎన్నిక జరిగింది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ అది అధికారంలో ఉన్న పార్టీపై ప్రజలు మొగ్గు చూపారని అనుకోవాలి. కానీ నేడు అలా కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. పల్లెలు, పట్టణాలలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకం...
అయితే ఈ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమని చెప్పాలి. ఎందుకంటే ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంతో పాటు ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు జరిపారన్న దానిపైనే ఈ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేసే అవకాశముంది. ప్రధానంగా రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా పథకాన్నిఅమలు చేసినప్పటికీ యూరియా కొరత కొంత రైతుల్లో అసంతృప్తి ఉంది. మరొకవైపు ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఈ ప్రభుత్వంలో బాగానే విడుదలయ్యాయి. అయినా నిరుద్యోగ యువతలో ఎంత మేరకు అసంతృప్తి ఉందన్నది ఈ ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టమవుతుంది.
పాజిటివ్ ఓటింగ్ ఉంటుందని...
ఇక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులను పంపిణీ చేసింది. ఇది తమకు పాజిటివ్ గా ఓటింగ్ ఉంటుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేసుకుంటున్నారు. మరొకవైపు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కూడా ఒకరకంగా తమకు అనుకూలంగా మారతాయని భావిస్తున్నారు. అయితే ఇచ్చిన హామీలు ఎంతమందికి అమలయ్యాయి? ఎంత మంది లబ్ది పొందారు? గత ప్రభుత్వం లో లబ్ది పొందిన వారితో పాటు ఈ ప్రభుత్వంలో మరికొంత మంది ప్రయోజనం పొందారా? లేక కోత విధించారా? అనేది ఫలితాలను బట్టి వెల్లడవుతుంది. గత ప్రభుత్వంలో కల్యాణ లక్ష్మి పథకం అమలయ్యేది. ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయలేదు. ఇలా కొన్ని హామీలను అమలు చేయకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు వెళుతుంది. మరి ప్రజలు హ్యాండ్ ఇస్తారా? కాంగ్రెస్ కు అండగా నిలబడతారా? అన్నది ఎన్నికల ఫలితాల మాత్రమే తెలియనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు...
రాష్ట్రంలోని 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 12,733 పంచయతీలకు, 1,12,288 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
తెలంగాణలో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేసింది. తెలంగాణలోని 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు 1.12 లక్షల పోలింగ్ స్టేషన్లను గుర్తించారు. అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరణ కార్యక్రమం ఉండనుంది. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 27న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రెండో విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 31 న తొలి విడత పోలింగ్ జరగనుంది. పంచాయతీలకు రెండో విడత పోలింగ్ నవంబరు నాలుగో తేదీన, మూడో విడత నవంబరు 8వ తేదీన నిర్వహించనున్నారు. పోలింత్ పూర్తయిన తర్వాత అదే రోజు గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నవంబరు 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది.