Telangana : కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పడం ఖాయం కనిపిస్తున్నట్లుందిగా?
తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త, పాత నేతల మధ్య వార్ ఊపందుకున్నట్లు కనిపిస్తుంది
తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త, పాత నేతల మధ్య వార్ ఊపందుకున్నట్లు కనిపిస్తుంది. అయితే మిగిలిన చోట్ల కొంత నేతలు కామ్ గా ఉన్నప్పటికీ సీనియర్ నేత జీవన్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పెత్తనం చేసే వారిని ఉపేక్షించడానికి ఇష్టపడటం లేదు. ముఖ్యంగా జగిత్యాల ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజీవ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయన అప్పటి నుంచి తన అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. అయినా రాష్ట్ర నాయకత్వం కానీ, కేంద్ర నాయకత్వం కానీ పట్టించుకోవడం లేదు. దీంతో ఇక సమయం వచ్చినప్పుడల్లా జీవన్ రెడ్డి తన అసహనాన్ని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. తాను రాజీ పడేది లేదని జీవన్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు హెచ్చరికలు పంపుతున్నారు.
తరచూ నాయకత్వంపై...
జీవన్ రెడ్డి తరచూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంపైన కూడా విరుచుకుపడుతున్నారు. నిజమైన కాంగ్రెస్ నేతలను పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దూరం పెట్టారని, ఇది భవిష్యత్ లో పార్టీ ఎదుగుదలకు మంచిది కాదని చెబుతున్నారు. తాజాగా ఆయన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని కూడా బహిష్కరించి వెళ్లిపోయారు. ఆ సమావేశానికి ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ ను ఆహ్వానించడమే పెద్దాయన కోపానికి కారణం. దీంతో జీవన్ రెడ్డి తాను అనుకున్నది మీడియా ముందు కక్కేసి బయటకు వెళ్లిపోయారు. నిజానికి జీవన్ రెడ్డికి సీనియర్ నేతగా పార్టీ అన్యాయం చేసిందనే చెప్పాలి. పార్టీ కష్టకాలంలో జెండా వదలకుండా అట్టిపెట్టుకుని బీఆర్ఎస్ పై పోరాటం చేసిన జీవన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పదవిలేకుండానే ఇప్పటి వరకూ గడిపారు.
జెండాను వదలకుండా...
ఇక వేచి చూసి లాభం లేదని భావించిన పెద్దాయన వాయిస్ పెంచినట్లు కనపడుతుంది. దీర్ఘకాలంగా, పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా కాంగ్రెస్ జెండాను వదలకుండా పోరాడిన జీవన్ రెడ్డిని పక్కన పెట్టడంపై ఆయన వర్గం సీరియస్ గా ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఆయన కాంగ్రెస్ లో కీలక నేతగా కొనసాగుతున్నారు. దాదాపు నలభై ఏళ్ల నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. తొలుత టీడీపీ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమయినా తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన కొనసాగుతున్నారు. జీవన్ రెడ్డి ఇక తాడో పేడో తేల్చుకోవడానికే సిద్ధమయినట్లు కనిపిస్తుంది. ఆయన ఇక కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని పరా్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మరి జీవన్ రెడ్డిని బుజ్జగించే వారు కూడా ప్రస్తుతం రాష్ట్ర నాయకత్వంలో లేకపోవడంతో ఆయనకు ఢిల్లీ హైకమాండ్ పిలిచి హామీ ఇస్తేనే కాస్త శాంతించే అవకాశముంది. లేకుంటే మాత్రం కాంగ్రెస్ కు నష్టమే.