Kalvakuntla Kavitha : బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరుకు ఇది నిదర్శనమా? కవిత ప్రశ్నల్లో తప్పేముంది?
బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు స్పష్టంగా కనపడుతుంది. కేసీఆర్ కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ లో మూడు వర్గాలు అయిపోయినట్లు స్పష్టంగా కనపడుతుంది
బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు స్పష్టంగా కనపడుతుంది. కేసీఆర్ కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ లో మూడు వర్గాలు అయిపోయినట్లు స్పష్టంగా కనపడుతుంది.ప్రాంతీయ పార్టీలు అధికారం కోల్పోయినప్పుడు ఇది సర్వసాధారణమే. అయినప్పటికీ క్యాడర్ లో నిరాశ నిస్పృహను కలిగిస్తాయని వేరే చెప్పాల్సిన పనిలేదు. వారసత్వం కోసం సహజంగానే పోటీ పెరుగుతుంది. కుమారుడిగా కేటీఆర్ కు కేసేఆర్ తర్వాత పార్టీ పగ్గాలను స్వీకరించేందుకు అన్ని అర్హతలున్నాయి. అలాగే కుమార్తెగా కల్వకుంట్ల కవితకు కూడా ఈ విషయంలో ఎలాంటి అడ్డంకులు లేవు. ఇక మేనల్లుడు హరీశ్ రావుకు మాస్ ఫాలోయింగ్ ఉండటంతో ఆయన కూడా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అందుకే ముగ్గురు నేతలు వారసత్వం కోసం ఆశలు పెంచుకోవడంలో తప్పులేదు.
హరీశ్ రావును బుజ్జగించినా...
నిన్నటి వరకూ హరీశ్ రావు వేరుకుంపటి పెట్టుకుంటారన్న వార్తలు కొంత సంచలనం కలిగించాయి. అయితే హరీశ్ రావుతో కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లి మరీ కలసి వచ్చారు. ఇక హరీశ్ రావు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి రెండు రోజులుగా కేసీఆర్ తో సమావేశమవుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇచ్చిన నోటీసులపై చర్చిందేకేనని బయటకు చెబుతున్నప్పటికీ హరీశ్ రావును కేసీఆర్ బుజ్జగించడానికే పిలిచారన్న టాక్ వినపడుతుంది. కేసీఆర్ తో సమావేశం తర్వాతనే హరీశ్ రావు కేటీఆర్ కు పార్టీ పగ్గాలతో పాటు అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని హరీశ్ రావు చెప్పారు. హరీశ్ రావు తాను సాధారణ కార్యకర్తగా పార్టీలో పనిచేస్తానని చెప్పారు.
కేటీఆర్ కు అర్హత ఉన్నా...
కేటీఆర్ ఉన్నత చదువులు చదువుకుని ఉద్యమంలో పాల్గొంటూ రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అందుకే ఆయనకు ముందుగానే కేసీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని అప్పగించారు. కొన్నేళ్ల నుంచి పార్టీని కేటీఆర్ నడిపిస్తున్నాడు. ఏడాది నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయితే కేటీఆర్ అంతా తానే అయి చూసుకుంటున్నారు. క్యాడర్ కూడా తమ భవిష్యత్ నేత కేటీఆర్ అని మానసికంగా ఫిక్స్ అయ్యారు. నేతలు కూడా కేటీఆర్ చుట్టూ ప్రదిక్షిణలు చేస్తున్నారంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి అదే రకమైన సిగ్నల్స్ వచ్చాయని అనుకోవాలి. అందుకే కేటీఆర్ కు పార్టీ పగ్గాలను పూర్తిగా అప్పగిస్తానని కేసీఆర్ చెప్పినా ఎవరూ అభ్యంతరం చెప్పరు కూడా.
కవిత విషయంలోనే...
కానీ కల్వకుంట్ల కవిత విషయంలోనే కొంత తేడా కనపడుతుంది. ఆమెపై ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఉంది. ఆరు నెలల పాటు జైల్లో ఉండి వచ్చారు. అందులో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ కవిత అందులో దోషిగానే జనం చూస్తున్నారు. ఈ సమయంలో కవితకు ప్రాధాన్యం ఇస్తే బాగుండదని కేసీఆర్ భావించి ఉండవచ్చు. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కయ్యానికి దిగే కంటే కాంగ్రెస్ ను ముందు రాష్ట్రంలో అణిచివేయాలన్న ప్లాన్ తోనే కేసీఆర్ బీజేపీపై ఫైర్ కాకపోయి ఉండవచ్చన్న భావన కలుగుతుంది. కవిత తనను జైల్లో పెట్టిన పార్టీని ఒక్క మాట మాట్లాడకుండా ప్రసంగాన్ని ముగించడంపైనే అభ్యంతరం తెలిపారు. తాను కూడా ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించానని, జాగృతి పేరుతో మహిళలను ఏకం చేశానని, అలాంటి తనను పక్కన పెట్టడంపై ఆమె కొంత ఇబ్బంది పడుతున్నారు. అయితే ఫ్యామిలీ పాలిటిక్స్ కావడంతో ఇది టీ కప్పులో తుపానులా తొలిగిపోతుందని నేతలు చెబుతున్నారు.