Telangana : ఇందిరమ్మ ఇళ్లపై తాజా అప్ డేట్.. ఇంకా వెయిట్ చేయాల్సిందేనా?

తెలంగాణలో నాలుగు సంక్షేమ పథకాలకు లబ్దిదారుల ఎంపిక ఆలస్యమయ్యే అవకాశముంది

Update: 2025-01-24 07:31 GMT

తెలంగాణలో నాలుగు సంక్షేమ పథకాలను ఈ నెల 26వ తేదీ నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటకీ అది ఆచరణలో సాధ్యం అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. గ్రామ సభలు నేటితో ముగియనున్నాయి. ఇప్పటి వరకూ దాదాపు ఎనిమిది లక్షల దరఖాస్తులు అందాయి. వీటిని పరిశీలించడానికి అధికారులకు కొంత సమయం పట్టే అవకాశముంది. గ్రామసభల్లో కేవలం అర్హులైన వారి పేర్లను మాత్రమే ప్రకటించారు. అయితే ఇది ఫైనల్ జాబితా కాదని అధికారులు చెబుతున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతనే లబ్దిదారుల జాబితాను విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియలో ఆలస్యమవుతుంది.

విధివిధానాలను రూపొందించినా...
ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం కొన్ని విధివిధానాలను ఇప్పటికే రూపొందించింది. తొలి జాబితాలో సొంత ఇంటి స్థలం ఉన్నవారినే ఎంపిక చేస్తామని స్పష్టంగా చెప్పింది. సొంత స్థలం చూపించిన వారిలో అర్హులైన వారిని ఎంపిక చేయాల్సి ఉంది. ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలను విడతల వారీగా ప్రభుత్వం విడుదల చేయనుంది. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించడంతో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియక్లిష్టతరంగా మారింది. అర్హులైన వారందరికీ ప్రాధాన్యత క్రమంలో ఇస్తామని, ఈ విడత రాకపోయినా మలి విడతలోనైనా ఇళ్లు దక్కుతాయని అధికారులు చెబుతున్నా అత్యధిక మంది తొలి జాబితాలోనే తమ పేరు ఉండాలని పట్టుబడుతున్నారు.
అందుకే రచ్చ...
అందుకే గ్రామసభల్లో రచ్చ మొదలయింది. దీనిపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా క్లారిటీ ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన వారందరికీ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు. అలాగే రేషన్ కార్డులు, రైతు భరోసా, ఆత్మీయ రైతు భరోసా నిధులను కూడా అర్హులందరికీ అందచేస్తామని తెలిపారు. దీనికి ఒక టైం అంటూ ఏమీ లేదని, ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే వీలుందని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 80 లక్షల మంది వరకూ దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హులైన వారి పేర్లను తొలి జాబితాలో ప్రకటించే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. సొంత స్థలం ఉన్నవారు 13 లక్షల మంది వరకూ ఉన్నారు. అందుకే వడపోతకు మరికొంత సమయం పట్టే అవకాశముందని అధికారవర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News