Telangana : "లోకల్" పై పట్టు.. కిక్కు తో కొట్టు
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయింది. ఈ నెల 9వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయింది. ఈ నెల 9వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే తెలంగాణలో మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతుండటంతో అభ్యర్థులు గ్రామ స్థాయి నేతలను దావత్ లతో ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. గ్రామ, మండల స్థాయి నేతలకు చుక్క, ముక్కతో విందులు ఇచ్చి మంచి చేసుకునే ప్రయత్నంలో పడ్డారు. అందుకే తెలంగాణ ఎక్సైజ్ శాఖ అప్రమత్తమయింది. మద్యం అమ్మకాలు గత నెలలోనే రికార్డు స్థాయిలో జరిగినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. దసరా నుంచి షురూ చేసినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి...
అందుకే పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే మద్యంపై ఒకకన్నేసి ఉంచాలని నిర్ణయించారు. అభ్యర్థులు తమ ఖాతాలో పడకుండా నామినేషన్ తర్వాత కూడా మద్యం పంపిణీ చేయాలంటే ఇక్కడ కొనుగోలు చేయకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెప్పించుకోవడానికి సమాయత్తమయినట్లు వస్తున్న వార్తలతో అబ్కారీ శాఖ అప్రమత్తమయింది. ప్రధానంగా కర్ణాటక, ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి మద్యాన్ని దిగుమతి చేసుకుని నిల్వ చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు ఎక్సైజ్ శాఖకు ఉప్పందింది. దీంతో అంతరాష్ట్ర సరిహద్దుల్లో అబ్కారీ శాఖ నిఘాను పెంచింది. స్థానిక పోలీసులు, రెవెన్యూ శాఖలతో కలిపి చెక్ పోస్టులను సరిహద్దు జిల్లాల్లో ఏర్పాట్లు చేసింది.
అంతరాష్ట్ర సరిహద్దుల్లో...
ప్రతి వాహనాన్ని చెక్ చేసి పంపించేసేలా పటిష్టమైన యంత్రాగాన్ని అక్కడ నియమించింది. ఇక్కడ కొనుగోలు చేస్తే భారీ మొత్తంలో నిల్వచేసుకోవడానికి వీలుండదు. ఎందుకంటే సులువుగా ఎక్సైజ్ శాఖకు తెలిసిపోతుంది. ఏ మద్యం దుకాణం నుంచి ఎవరు కొనుగోలు చేశారన్న విషయం తెలిస్తే అది బయటపడే అవకాశముండటంతో నోటిఫికేషన్ కు ముందే ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా తరలించేందుకు స్థానిక నేతలు సిద్ధమయ్యారని సమాచారం. తాము ఖచ్చితంగా పోటీలో ఉంటామని భావించిన వారు ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి మద్యం తెచ్చి దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానిస్తున్నారు. అలాగే గుడుంబా, సారా తయారీ పై కూడా నిఘా తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. జిల్లాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు నిరంతరం తనిఖీలు చేయాలంటూ ఆదేశాలు అందినట్లు తెలిసింది.