Revanth Reddy : రేవంత్ వెనకేసుకొచ్చి వెనకబడుతున్నారా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నట్లు కనపడుతుంది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నట్లు కనపడుతుంది. ఆయన తాత్కాలికంగా కాంగ్రెస్ గెలుపును కోరుకుంటున్నట్లు కనపడుతుంది. రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు కేవలం మున్సిపల్ ఎన్నికలను ఉద్దేశించి చేసినవిగానే చూడాలంటున్నారు. ఖమ్మం పర్యటనలో ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడుల ప్రస్తావన తీసుకువచ్చి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓటర్ల మద్దతును పొందేందుకు ఆయన పడుతున్న తాపత్రయంలో భాగంగానే ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లు కనపడుతుంది. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో బొంద పెట్టిన బీఆర్ఎస్ ను పాతాళంలోకి తొక్కేయాలని అనడం వెనక కూడా సెటిలర్ల ఓట్ల కోసమేనని వేరే చెప్పాల్సిన పనిలేదు.
రాష్ట్రమంతటా ప్రభావం...
అయితే రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలోనే ఈ వ్యాఖ్యలు చేయడం కేవలం అక్కడి కార్పొరేషన్ , ఆ ప్రాంత మున్సిపల్ ఎన్నికల్లోనే ప్రభావం చూపదు. రాష్ట్రమంతటా మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్టీఆర్ విషయంలో తెలంగాణ ప్రజలకు కొంత సానుకూలత ఉన్నప్పటికీ చంద్రబాబు విషయంలో మాత్రం ఇప్పటికీ లేదు. చంద్రబాబు నాయుడుతో పాటు జగన్ ను కూడా తెలంగాణ ద్రోహులుగానే ఇప్పటికీ చూస్తున్నారు. దీనికి తోడు ఇటీవల పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు కృష్ణా జలాల విషయంలో కూడా చంద్రబాబు వత్తిడికి తలొగ్గుతున్నారని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి చేయడం కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం చేకూర్చినట్లే అవుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
పట్టణ ప్రాంతంలో జరిగే...
పట్టణ ప్రాంతంలో జరిగే ఎన్నికలు కావడంతో ఓటర్లు సెంటిమెంట్ కు మరింత లొంగిపోయే అవకాశముందన్న కామెంట్స్ సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. అసలే రేవంత్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ముద్రను పదే పదే బీఆర్ఎస్ వేస్తుంది. బీఆర్ఎస్ వ్యాఖ్యలకు మద్దతిచ్చే విధంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలున్నాయని సోషల్ మీడియాలో పెద్దయెత్తున పోస్టులు కనపడుతున్నాయి. ఈ సెంటిమెంట్ ఇక్కడితో ఆగదని, వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలపై కూడా ప్రభావం పడే అవకాశాలున్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. రేవంత్ రెడ్డి కేవలం మున్సిపల్ ఎన్నికల కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ రానున్న కాలంలో కాంగ్రెస్ కు నష్టం చేకూర్చనున్నాయా? లేదా? అన్నది భవిష్యత్ లో తేలనుంది.