Revanth Reddy : బీజేపీ ట్రాప్ లో రేవంత్ ...ఇరకాటంలో పడినట్లేగా

బీజేపీ వేసిన ట్రాప్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పడిపోయినట్లే కనిపిస్తుంది.

Update: 2025-11-20 12:27 GMT

బీజేపీ వేసిన ట్రాప్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పడిపోయినట్లే కనిపిస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను అరెస్ట్ చేస్తే ఒక రకమైన ఇబ్బంది. చేయకుంటే మరొకరకమైన విమర్శలు. ఇలా ఇప్పటి వరకూ నెపాన్ని బీజేపీపైనే నెడుతూ వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ ఒక రకంగా ఝలక్ ఇచ్చినట్లే కనపడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సమయంలో కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే సింపతీ వర్క్ అవుట్ అయి కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. అరెస్ట్ విషయంలో ఏ మాత్రం నాన్చుడు ధోరణితో వ్యవహరించినా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని బీజేపీ నేతలు విమర్శలు చేస్తూ ఎన్నికలకు వెళ్లే అవకాశముంది.

ఫార్ములా ఈ రేసు కేసులో....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. పలుమార్లు కేటీఆర్ ను విచారించారు. ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో 54 కోట్ల రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. అయితే ప్రజాప్రతినిధి కావడంతో కేటీఆర్ విచారణకు అనుమతివ్వాలని అవినీతి నిరోధక శాఖ గవర్నర్ ను కోరింది. నేడు గవర్నర్ కేటీఆర్ విచారణకు అనుమతివ్వడంతో కేటీఆర్ ను విచారించిన తర్వాత ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశముంది. ఫార్ములా ఈ కారు రేసులో త్వరలోనే ప్రాసిక్యూషన్ చేయనున్నారు.
గవర్నర్ అనుమతి ఇవ్వలేదంటూ...
గవర్నర్ అనుమతి ఇవ్వలేదంటూ పలు మార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంటే తప్పిదాన్ని రాజ్ భవన్ పై నెట్టే ప్రయత్నం చేశారు. ఒకరకంగా బీజేపీని కార్నర్ చేసేందుకు ప్రయత్నించారు. గవర్నర్ నుంచి అనుమతి రావడంతో ఏసీబీ ఛార్జిషీట్ దాఖలు చేసి న్యాయస్థానంలో విచారణ చేపట్టాల్సి ఉంది. న్యాయస్థానంలో ఈ కేసును పెట్టి కోర్టు ఆదేశాల మేరకు నడచుకోవాల్సి ఉంటుంది.తాను జైలుకు వెళ్లడానికి సిద్ధమని కేటీఆర్ ఎప్పటి నుంచో ప్రకటిస్తున్నారు. కానీ జైలుకు పంపితే రాజకీయ కక్ష సాధింపు చర్యగా బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లి సానుభూతి పొందే అవకాశముంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆమోదంతో రేవంత్ ప్రభుత్వం ఒకింత ఇరకాటంలో పడినట్లయిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
Tags:    

Similar News