SLBC Accident : ఆ ఏడు మృతదేహాలు ఎక్కడ.. ఇంత వరకూ జాడ లేక
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో సహాయక చర్యలు పంథొమ్మిదో రోజుకు చేరుకున్నాయి
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో సహాయక చర్యలు పంథొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. మొత్తం ఎనిమిది మంది టన్నెల్ లో చిక్కుకోగా ఒకరి మృతదేహం మాత్రమే వెలికి తీశారు. సహాయక బృందాలు టన్నెల్ లోపలకి వెళ్లి తవ్వకాలు జరపడానికి అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఒకవైపు ఉబికి వస్తున్న నీటితో పాటు, బురద పేరుకుపోయి ఉండటంతో సహాయక బృందాలు కూడా రిస్క్ లో పడే అవకాశముందని భావించి జాగ్రత్తగా చర్యలు చేపడుతున్నారు. మరొకవైపు టీబీఎం మిషన్ శిథిలాలు కూడా అడ్డంకిగా మారాయి. వీటిని అధిగమించి తవ్వకాలు జరపాలంటే సాధ్యం అయ్యే పని కాదని సహాయక బృందాలు చెబుతున్నాయి.
ప్రమాదకరమైన పరిస్థితులు...
తాము ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటీకి అర మీటర్ దూరంలో ప్రమాదకరమైన పరిస్థితులున్నాయని సహాయక బృందాలు చెబుతున్నాయి. అందుకే కేరళ నుంచి తెప్పించిన జాగిలాలతో మృతదేహాల జాడను కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మానవ ప్రయత్నం కంటే రోబోలతోనే సాధ్యమని నమ్మి నేడు రోబోల సహకారంతో మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. రోబోలయితే ప్రాణ నష్టం జరగకుండా సహాయక చర్యలు చేపట్టవచ్చన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి రోబోలను తెప్పించారు. వాటి సహకారంతో మృతదేహాలను వెలికి తీయాలని నేడు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి.
పదకొండు బృందాలు...
ఇప్పటి వరకూ గురుప్రీత్ సింగ్ మృతదేహం ఒక్కటే లభ్యం కావడంతో మిగిలిన ఏడు మృతదేహాల కోసం అన్వేషణ కొనసాగుతుంది. ఆ మృతదేహాలు ఎక్కడ ఉన్నాయన్నది కూడా తెలియడం లేదు. లోపలకి వెళ్లి మానవ ప్రయత్నం చేయాలంటే సాధ్యపడటం లేదు. అందుకే రోబోలను ఉపయోగించి కొంత వరకైనా పురోగతిని సాధించే అవకాశముందన్న నమ్మకంతో సహాయక బృందాలున్నాయి. ఈ సహాయక చర్యల్లో మొత్తం పదకొండు బృందాలు షిఫ్ట్ ల వారీగా పాల్గొంటున్నాయి. అయితే రోబోలు ఎంత వరకూ పనిచేస్తాయన్నది మాత్రం ఇంతవరకూ తేలలేదు. ఇది చివరి ప్రయత్నంగానే చూడాలని ఉన్నతాధికారులు చెబుతున్నారు. తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా లోపలి పరిస్థితులు ఆటంకంగా మారాయంటున్నారు.