SLBC Accident : మరో ఏడుగురి జాడ తెలియక.. సహాయక బృందాల అన్వేషణ

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి

Update: 2025-03-11 03:32 GMT

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికి ఒక మృతదేహం మాత్రమే లభ్యమయింది. గురుప్రీత్ సింగ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి వారి బంధువులకు అప్పగించారు. మరో ఏడు మృతదేహాల కోసం ఇంకా వెదుకులాట కొనసాగుతూనే ఉంది. ఎంత తవ్వుతున్నప్పటికీ మృతదేహాల జాడ తెలియడం లేదు. గల్లంతయిన వారు టన్నెల్ లో ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. కేరళ నుంచి తెప్పించిన ప్రత్యేక జాగిలాలు సూచనల మేరకు కొంత జాడ లభిస్తుందని భావించినా పూర్తి స్థాయిలో మాత్రం ఆచూకీ లభించడం లేదు.

డేంజర్ జోన్ లో...
టన్నెల్ లో పూర్తిగా మట్టి, నీరు, టీబీఎం మిషన్ శకలాలతో నిండిపోవడంతో వాటి తొలగింపు కూడా సాధ్యపడటం లేదు. గురుప్రీత్ సింగ్ మృతదేహం లభించిన చోటునే మరికొన్ని మృతదేహాలు ఉండవచ్చని ఆ దిశగా సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఎనిమిది అడుగుల మేరకు లోతు తవ్వినా ఎటువంటి మృతదేహం కనిపించ లేదు. దీంతో మరికొద్ది దూరంలో పడి ఉంటాయేమోనన్న అనుమానం కలుగుతుంది. అయితే అది సేఫ్ జోన్ కాదని భావించి ఆ ప్రాంతానికివెళ్లేందుకు సహాయక బృందాలు కూడా వెనకడుగు వేస్తున్నాయి.
పదహారో కిలోమీటర్ వద్ద...
పదహారో కిలోమీటర్ వద్ద పరిస్థితి ప్రమాదకరంగా ఉందని చెబుతున్నాయి. ఇప్పటికి కార్మికులు గల్లంతయి పద్దెనిమిది రోజులు దాటుతుంది. ఇక బతికి ఉండే అవకాశాలు ఎంత మాత్రం లేవు. అయితే రోబోల సహకారంతో మృతదేహాలను వెలికి తీయాలని సహాయక బృందాలు భావిస్తున్నాయి. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ ప్రమాదంపై సమీక్ష జరపనున్నారు. ఈరోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టన్నెల్ వద్దకు చేరుకుని సహాయక చర్యలను గురించి అడిగి తెలుసుకోనున్నారు.















Tags:    

Similar News