ఎట్టకేలకు చిక్కిన ఎలుగుబంటి

కరీంనగర్‌లో ఓ ఎలుగుబంటి ప్రజలను టెన్షన్ పెట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి అడవుల నుండి

Update: 2023-08-12 13:04 GMT

కరీంనగర్‌లో ఓ ఎలుగుబంటి ప్రజలను టెన్షన్ పెట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి అడవుల నుండి ఎలుగుబంటి జనవాసాల మధ్యకు వచ్చింది. బొమ్మకల్‌ సమీపంలో ఎలుగుబంటి తిరగడం గమనించిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగి ఎలుగుబంటిని పట్టుకునేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టారు. దాదాపు 12 గంటల పాటు అధికారులు ఎలుగుబంటిని పట్టుకోడానికి ప్రయత్నించారు. అయితే రేకుర్తి వద్ద చిక్కింది. మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో ఎలుగుబంటి స్పృహ కోల్పోయింది. రెస్క్యూ వాహనంలో అధికారులు ఎలుగుబంటిని జూ పార్క్‌కు తరలించారు. ఎట్టకేలకు ఎలుగుబంటి చిక్కడంతో అధికారులు, స్థానికులు ఊపీరి పీల్చుకున్నారు.

శుక్రవారం రాత్రి బొమ్మకల్ పంచాయతీ పరిధిలోని రజ్వీ చమాన్ ప్రాంతంలోని ఓ కాలనీలో ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. భయంతో కాలనీవాసులు తలుపులు వేసుకుని మరీ భయపడిపొయారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడమే కాకుండా స్థానిక యువత కర్రలు పట్టుకుని గస్తీ కూడా చేపట్టారు. శనివారం ఉదయం రేకుర్తిలో నడిరోడ్డుపై సంచరిస్తూ ప్రజలకు కనిపించింది. ఎలుగు బంటిని చూసిన పట్టణవాసులు భయంతో పరుగులు పెట్టారు. దాన్ని పట్టుకోడానికి రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. చెట్ల పొదల మధ్య ఎలుగు బంటి ఉన్నట్లు గుర్తించి దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు.


Tags:    

Similar News