Rain Alert : మరో అల్పపీడనం పొంచి ఉందా? ఈ వానలేంటి మహప్రభో
Rain Alert : మరో అల్పపీడనం పొంచి ఉందా? ఈ వానలేంటి మహప్రభో
ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు మరొక ముప్పు పొంచి ఉంది. వచ్చే నెల నాలుగు, ఐదో తేదీల్లో బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మొంథా తుపాను ప్రభావంతో ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నవంబరు నాలుగైదు తేదీల్లో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం మన వైపునకు వస్తుందా? రాదా? అన్నదానిపై ఇంకా క్లారిటీ లేకపోయినా ఈ వానలు ఇప్పట్లో వదలే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుత మొంథా తుపాను వాయవ్య దిశగా కదులుతున్న నేపథ్యంలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. మరో రెండు రోజుల పాటు వానలు తప్పవని చెప్పింది.
ఏపీలోనూ నేడు వానలు...
ఆంధ్రప్రదేశ్ లో మొంథా తుపాను కారణంగా రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. ఈరోజు కూడా భారీ వర్షాలు అక్కడక్కడ పడే అవకాశముందని పేర్కొంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, నదులు పొంగి ప్రవాహిస్తున్నాయి. అందుకే వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. సముద్రంలో కూడా అలల ఉధృతి తగ్గలేదని, నేడు కోటి సోమవారం (శ్రవణా నక్షత్రం) కావడంతో భక్తులు సముద్ర స్నానాలు చేయవద్దని కోరారు. సోమవారం కాకపోయినా కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రం రోజున నదీ స్నానాలు చేస్తే కోటి సోమవారాలు ఉప వాసాలున్నట్లు భావించడంతో అధికారులు సముద్రం, నదుల్లో స్నానాలకు రావద్దని సూచించారు.
తెలంగాణలో రెండు రోజులు...
తెలంగాణ ప్రాంతంలోనూ రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మొంథా తుపాను తీరం దాటి బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారిందని, అది తెలంగాణ మీదుగా ఛత్తీస్ గఢ్ వైపునకు కదులతుండటంతో తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. నిన్నటి నుంచే కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈరోజు హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ప్రమాదకరంగా వాగులు ప్రవహిస్తున్నందున వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని తెలిపింది.