Weather Report : మరో మూడు రోజులు హై అలెర్ట్.. చలిగాలులు వీస్తాయట

మరో మూడు రోజులు చలిగాలుల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Update: 2025-12-16 03:58 GMT

దేశమంతటా చలిగాలుల విజృంభణ కొనసాగుతుంది. మరొక మూడు రోజుల పాటు భారత వాతావరణ శాఖ హై అలెర్ట్ ప్రకటించింది. అవసరమైతే తప్ప వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక రోగులు బయటకు రావద్దంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్పల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు కూడా బయటకు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కోల్డ్ వేవ్స్ అందరినీ భయపెడుతున్నాయి. అదే సమయంలో అనేక మంది అవస్థలు పడుతున్నారు. చలిగాలుల తీవ్రతకు తోడు పొగమంచు కూడా తోడవ్వడంతో ప్రజలు గజ గజ వణుకుతున్నారు. మరో మూడు రోజులు ఇదే రకమైన పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

పగలు, రాత్రి వేళల్లో...
ఆంధ్రప్రదేశ్ లో చలిగాలుల తీవ్రత మరింత తీవ్రమయింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పగలు, రాత్రి తేడా లేకుండా ఉష్ణోగ్రతలు కనిష్టానికి చేరుకుంటున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనేక ప్రాంతాలు చలిగుప్పిట్లో చిక్కుకుపోయి ఉన్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకూ చలిమంటలతో వారు జీవనం కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొగమంచుతో పాటు చలిగాలుల తీవ్రత మరికొద్ది రోజుల పాటు కొనసాగే అవకాశముందని, మరొక మూడు రోజులు ఇళ్ల నుంచి వీలయినంత వరకూ బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పొడి వాతావరణం ఉన్నప్పటికీ సాధారణం కంటే నాలుగు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
అత్యల్పంగా....
తెలంగాణలోనూ చలిగాలుల తీవ్రత మరో మూడు రోజుల పాటు కొనసాగుతుందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. హైదరాబాద్ నగరంతో పాటు ఆదిలాబాద్, కొమ్రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, వరంగల్, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న మూడు రోజులు చలితీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండటంతో పాటు కనిష్టంగా అంటే సింగిల్ డిజిట్ లో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. చలి నుంచి కాపాడుకోవటానికి తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు.


Tags:    

Similar News