Meenakshi Natarajan : మీనాక్షి.. దూరం.. దూరం.. రాహుల్ ను అదే కోరారా?
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ నామమాత్రంగా మారిపోయారు
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ నామమాత్రంగా మారిపోయారు. ఆమె పెద్దగా తెలంగాణ రాజకీయాలను పట్టించుకోవడం లేదనే అనిపిస్తుంది. ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలను చూసి విసిగిపోయారా? లేక అంతా బాగుండటంతో తాను ఇక్కడ ఎక్కువగా జోక్యం చేసుకోవడం ఎందుకని మౌనంగా ఉన్నారా? అన్నది మాత్రం తెలియడం లేదు. గత కొద్ది నెలలుగా మీనాక్షి నటరాజన్ పెద్దగా కనిపించడం లేదు. ఇటీవల పాదయాత్ర పేరుతో కొంత హడావిడి చేసిన మీనాక్షి నటరాజన్ తర్వాత మాత్రం కామ్ అయిపోయినట్లే కనిపిస్తోంది. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా కూడా మీనాక్షి ఊసు ఎక్కడా వినిపించ లేదు. కనిపించలేదు.
తెలంగాణ రాజకీయాల పట్ల...
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ని సెట్ చేస్తారని పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ ను అధినాయకత్వం నియమించినప్పటికీ ఆమె తెలంగాణ రాజకీయాల పట్ల అనాసక్తితో ఉన్నట్లు కనిపిస్తుంది. మీనాక్షి నటరాజన్ ఇన్ ఛార్జిగా నియమితులైన తొలినాళ్లలో కొంత హడావిడి చేశారు. కానీ తర్వాత జరిగిన పరిణామాలు ఆమెను వెనకడుగు వేసేలా చేశాయని కొందరు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఉన్న ఇన్ ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షీని తొలగించిన పార్టీ నాయకత్వం గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే మీనాక్షి నటరాజన్ ను ఇన్ ఛార్జిగా నియమించింది. అయినా మీనాక్షి నటరాజన్ పెద్దగా పార్టీ విషయాలను పట్టించుకోకపోవడంతో మరొక ఇన్ ఛార్జిని నియమిస్తే మంచిదని మీనాక్షి నటరాజన్ హైకమాండ్ ను కోరారా? అన్న అనుమానం వ్యక్తమవుతుంది.
తనను తప్పించాలని...
మీనాక్షి నటరాజన్ రాహుల్ కోటరీలో కీలకమైన నేత కావడంతో ఆమె పార్టీని సెట్ చేస్తారని భావించారు. పార్టీని గాడిలో పెట్టడం తన వల్ల కాదని మీనాక్షి నటరాజన్ నిర్ణయానికి వచ్చినట్లు కనపడుతుంది. అందుకే ఆమె దూరం పాటిస్తున్నారన్న టాక్ గాంధీ భవన్ లో ఎక్కువగా వినిపిస్తుంది. మీనాక్షి నటరాజన్ రాహుల్ టీం లో ఒక సభ్యురాలు అయినప్పటికీ ఆమె మాట చెల్లుబాటు కావడం లేదు. నిర్ణయాలు తీసుకున్నా అవి అమలు కావడంలేదు. అందుకోసమే తనను తెలంగాణ ఇన్ ఛార్జి పదవి నుంచి తప్పించి మరొకరికి అవకాశం ఇవ్వాలని మీనాక్షి నటరాజన్ స్వయంగా రాహుల్ ను కలిసి కోరినట్లు చెబుతున్నారు.చాలా రోజుల తర్వాత రేపు మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్ కు రానున్నారు. కొత్తగా ఎన్నికయిన డీసీసీ అధ్యక్షులతో జరుగుతున్న సమావేశంలో పాల్గొని ఆమె తిరిగి ఢిల్లీకి వెళ్లిపోతారని చెబుతున్నారు. మరి మీనాక్షిలో ఈ నిర్వేదం ఎందుకన్నదిమాత్రం తెలియరావడం లేదు.