Telangana : రేవంత్ కు ముందుంది అసలైన సవాల్...అధిగమించడం కష్టమేనా?
తెలంగాణ కాంగ్రెస్ కు స్థానిక సంస్థల ఎన్నికలు సవాల్ గా మారాయి. నిజానికి ఇరవై నెలల కాంగ్రెస్ పాలనకు ఈ ఎన్నికలు ఒక రెఫరెండంగా చూడాలి
తెలంగాణ కాంగ్రెస్ కు స్థానిక సంస్థల ఎన్నికలు సవాల్ గా మారాయి. నిజానికి ఇరవై నెలల కాంగ్రెస్ పాలనకు ఈ ఎన్నికలు ఒక రెఫరెండంగా చూడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తుంది. అయితే అవి ఏ మేరకు ప్రజల్లో సంతృప్తి నిచ్చాయన్నది ఈ ఎన్నికల్లో తేలనుంది. ఎందుకంటే గ్రామ స్థాయిలోనూ, పట్టణ, నగర స్థాయిలో జరిగే ఎన్నికలు కావడంతో పాటు పార్టీ గుర్తు ఉన్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరగనుండటంతో ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ఇరవై నెలల పరిపాలనకు రెఫరెండంగానే భావించాలి. ఎవరు అవునన్నా... కాదన్నా రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ఈ ఎన్నికలు ప్రజల మూడ్ ను తెలియజేయనున్నాయి.
రైతుల్లోనూ అసంతృప్తి..
అందులోనూ ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారు జాము నుంచి క్యూ లైన్ లో నించుని యూరియా బస్తాల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా యూరియా కొరత త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తుంది. మరొకవైపు పాలన విషయంలోనూ ప్రజల్లో కొంత అసంతృప్తి ఉందన్నది వాస్తవం. కాంగ్రెస్ ప్రభుత్వం కావడంతో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీవైపు చూడాల్సి వస్తుంది. అందుకే రేవంత్ రెడ్డి స్వేచ్ఛగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. అదే సమయంలో సంక్షేమ పథకాలను కూడా అర్హులైన వారందరికీ అందచేయడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని సొంత పార్టీ నేతలే బయటపెడుతున్నారు. రైతు భరోసా వంటి పథకాలు చేపట్టినా దానిపై యూరియా వచ్చి ఇబ్బందిపెట్టినట్లయింది.
పట్టణ ప్రాంతంలో...
ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అననుకూల మైన కాలమేనని చెప్పాలి. పల్లె ప్రాంతాల్లో ఇలా ఉంటే హైదరాబాద్ వంటి నగరాల్లో హైడ్రా కూల్చి వేతలు రేవంత్ సర్కార్ పై కొంత మంది ప్రజల్లో అసంతృప్తి ఉంది. అదే సమయంలో మూసీ అభివృద్ధి పథకం కూడా హైదరాబాద్ దాని చుట్టు పక్కల ప్రాంతాల ప్రజల ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశముంది. ఇక బీసీ రిజర్వేషన్లను చట్టపరంగా అమలు చేయకుండా పార్టీ పరంగా చేసి ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. కానీ బీసీలు ఎంత మేరకు కాంగ్రెస్ కు అండగా నిలబడతారన్నది మాత్రం సందేహమే. ఇక అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతల మధ్య వైరుధ్యాలు, గ్రూపులు కూడా ఈ ఎన్నికల ఫలితాలపై ప్రతిబింబించే అవకాశముంది. అందుకే రేవంత్ రెడ్డికి మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు అంత సులువు కాదన్నది వాస్తవం. మరి గెలిచి పరువు నిలబెట్టుకుంటారా? ఓడి తమ పనితీరును ఇది అని చెప్పదలచుకున్నారా? అన్నది త్వరలోనే తెలియనుంది.