Telangana : పల్లెపోరులో కారు పరుగులు పెట్టాలన్న ప్రయత్నమేనా?

స్థానిక సంస్థల ఎన్నికలు కూడా డిసెంబరు నెలలో రావడంతో బీఆర్ఎస్ పార్టీకి కొంత కలసి వచ్చింది

Update: 2025-11-27 12:47 GMT

పల్లెపోరులో కారు పరుగులు పెట్టాలని చూస్తుంది. అందుకు సెంటిమెంట్ ను మరోసారి తెరపైకి తెచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా డిసెంబరు నెలలో రావడంతో బీఆర్ఎస్ పార్టీకి కొంత కలసి వచ్చింది. డిసెంబరు నెల అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తొలి ప్రకటన, కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష ఇవన్నీ గుర్తుకు తెస్తూ పెద్దయెత్తున రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను చేపట్టింది. . ఈ నెల 29వ తేదీ నుంచి డిసెంబరు 9వ తేదీ వరకూ దీక్షాదివస్ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబరు 11వ తేదీన తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీక్షాదివస్ ను నిర్వహిస్తూ ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది.

దీక్షాదివస్ పేరుతో...
కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చిందని, అలాంటి కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా, సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి కోటి ఎకరాలకు సాగునీరందించి మాగాణిగా మారిస్తే..జిల్లాల్లో భూముల విలువ పెరగడానికి కారణమైనందుకు కాంగ్రెస్ ఇప్పుడు కక్ష కట్టి కేసులు పెట్టి వేధిస్తుందని ప్రజల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నం కారు పార్టీ నేతలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా వేగంగా పరుగులు పెట్టించిన కేసీఆర్ ను కాదని కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చుకున్నందుకు అన్ని సంక్షేమ పథకాలకు తూట్లుపొడుస్తున్నారని ప్రజల్లోకి బలంగా ప్రచారం చేసే యత్నంలో భాగంగా ఈ దీక్షా దివస్ ను ప్రారంభించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది.
స్థానికంగా బలపడితే...
ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులు జిల్లాల్లో పర్యటించి క్యాడర్ ను సమాయత్తం చేస్తున్నారు. మరొకవైపు కేసీఆర్ కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కు వచ్చి నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారన్న ప్రచారమూ జరుగుతుంది. దాదాపు పన్నెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా దీక్షాదివస్ పేరుతో ప్రజల్లోకి వెళ్లడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, గత రెండేళ్ల నుంచి అమలు చేయని వాటిని ప్రస్తావిస్తూ ప్రజలను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికంగా బలంగా ఉంటేనే పార్టీ మనుగడ ఉంటుందని భావించిన బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకుని ముందుకు వెళుతుంది.


Tags:    

Similar News