Konda Surekha :కొండాకు షాకుల మీద షాకులు.. మంత్రి పదవికి ముప్పున్నట్లేనా?

తరచూ వివాదంలో ఇరుక్కుంటున్న కొండా సురేఖకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం షాక్ ఇచ్చింది

Update: 2025-10-16 04:14 GMT

తరచూ వివాదంలో ఇరుక్కుంటున్న కొండా సురేఖకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మేడారం జాతర అభివృద్ధి పనుల నుంచి దేవాదాయ శాఖ నుంచి తప్పించింది. మేడారంలో అభివృద్ధి పనులను ఆర్ అండ్ బి శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పనులను దగ్గరుండి నాణ్యతతో పాటు భక్తుల సౌకర్యాల కల్పన విషయంలో దేవాదాయ శాఖకు అంత సాంకేతికత లేదని భావించిన ప్రభుత్వం ఈ పనులను రోడ్లు భవనాల శాఖకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. మేడారం జాతర పనులలో ఇక దేవాదాయ శాఖకు సంబంధం లేదు. ఇక రోడ్లు, భవనాల శాఖ పర్యవేక్షణలోనే మేడారం పనులు జరగనున్నాయి.

మేడారం పనులు...
అంతా ఆర్ అండ్ బి మాత్రమే చూసుకునేలా ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మేడారంలో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతర కు సంబంధించి అభివృద్ధి పనులు చేసేందుకు ప్రభుత్వం 101 కోట్ల రూపాయలను కేటాయించింది. అయితే ఈ పనుల టెండర్లలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన మనుషులకు ఇచ్చారని, తమ శాఖ పరిధిలోని అంశమైనా తమను పట్టించుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని కొండా కుటుంబీకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వివాదం చెలరేగింది. కొండా మురళి పొంగులేటి పై హైకమాండ్ కు ఫిర్యాదు చేయడంతో పాటు మేడారం పనుల పరిశీలనకు మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండటం కూడా రాజకీయంగా చర్చకు దారి తీసింది.
ఎమ్మెల్యేలు కూడా...
దీంతో ప్రభుత్వం మేడారంలో అభివృద్ధి పనులను పర్యవేక్షణ బాధ్యత రోడ్లు భవనాల శాఖకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు కొండా సురేఖ ఏ రకంగా స్పందిస్తారన్నది చూడాలి. ఇప్పటికే కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ ను సస్పెండ్ చేయడమే కాకుండా తాజాగా తీసుకున్న నిర్ణయంతో కొండా సురేఖకు చెక్ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు కనపడుతుంది. ఇప్పటికే వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలందరూ ఏకమై కొండా సురేఖ వ్యవహార శైలికి వ్యతిరేకంగా అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు. తరచూ ఏదో ఒక ఘటనతో పార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పిగా మారిని కొండా కుటుంబానికి రేవంత్ రెడ్డి ఒకింత చెక్ పెట్టేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.
Tags:    

Similar News