Konda Surekha : కొండా సురేఖ ఇంట్లో మరోసారి హైడ్రామా

కాంగ్రెస్ లో మరో వివాదం చోటు చేసుకుంది. ఇందుకు మంత్రి కొండా సురేఖ మరోసారి వేదికగా మారారు

Update: 2025-10-16 02:21 GMT

కాంగ్రెస్ లో మరో వివాదం చోటు చేసుకుంది. ఇందుకు మంత్రి కొండా సురేఖ మరోసారి వేదికగా మారారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఓఎస్‌డీ ఎన్‌.సుమంత్‌ను అవినీతి ఆరోపణలతో తొలగించిన గంటలకే పోలీసులు అరెస్ట్‌ చేసేందుకు వెళ్లడంతో కాంగ్రెస్‌లో రాజకీయ తుపాన్‌ లేచింది. కొండా సురేఖ ఇంట్లో ఉన్న ఓఎస్డీ సుమంత్ ను అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందిని సురేఖ కుమార్తె కొండా సుస్మిత అడ్డుకుని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దీంతో కొండా సురేఖ తన కారులో సుమంత్ ను వెంట తీసుకుని వెళ్లిపోయారు. ఇది కాంగ్రెస్ లో మరొకసారి చర్చగా మారింది.

సుమంత్ ను తొలగించి...
రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి సుమంత్‌ ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తూ తర్వాత ఎండోమెంట్స్‌ శాఖ మంత్రివర్గానికి నియమితుడైన సుమంత్‌ కాంట్రాక్టు ఈ ఏడాది డిసెంబర్‌వరకు పొడిగించారు. అయితే, అధికారులను బెదిరించడం, లంచాలు తీసుకోవడం, మేడారం జాతర నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం అంతర్గత దర్యాప్తు జరిపి తొలగించింది. కొండా సురేఖ భర్త కొండా మురళి గతంలోనే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మేడారం ఒప్పందాల్లో జోక్యం చేసుకుంటున్నారని హైకమాండ్ కు ఫిర్యాదు చేసిన కొద్ది రోజుల్లోనే సుమంత్‌ సస్పెన్షన్‌ ఆదేశాలు జారీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
సుస్మిత ఫైర్...
బుధవారం రాత్రి టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది సురేఖ నివాసానికి వెళ్లి సుమంత్‌ అక్కడ ఉన్నాడని సమాచారం రావడంతో వెతికారు. ఆ సమయంలో సుస్మిత వారిని అడ్డుకుని, ‘‘ఈ వ్యవహారం సీఎంఓ ఆదేశాలతోనే జరుగుతోంది. సుమంత్‌పై పెట్టిన కేసు అసత్యం. ఇది రేవంత్‌రెడ్డి–పొంగులేటి కుట్ర’’ అని మీడియాకు తెలిపారు.ఆమె ఇంకా, ‘‘ఈ కేసు పేరుతో నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. కానీ నేను ఫోన్‌ చేసి అడిగితే ఆయన తాను ఏ ఫిర్యాదు చేయలేదన్నారు’’ అని చెప్పింది. తన తల్లిదండ్రులు లేదా సుమంత్‌కు ఏదైనా జరిగితే ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. కొండా సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులపై బహిరంగ విమర్శలు చేయడంతో పార్టీకి రాజకీయంగా ఇబ్బందిగా మారింది.


Tags:    

Similar News