Kalvakuntla Kavitha : కవిత ఇక వారి ట్రాప్ లో పడరట.. రోడ్ మ్యాప్ ఫిక్స్ చేసుకున్నట్లే
తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ పంటి కింద రాయిలా మారుతున్నారు. ఇప్పటికే కల్వకుంట్ల కవిత పాదయాత్ర చేపట్టారు. జిల్లాలను చుట్టుముట్టి ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు. జనంలోకి తనను బీఆర్ఎస్ నాయకత్వం బలవంతంగా బయటకు పంపించి వేసిందని చెబుతున్నారు. ఒకరకంగా సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తున్నారు. కల్వకుంట్ల కవిత వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్ర అనంతరం మేధావులతో చర్చించి కొత్త పార్టీ పెట్టడంపై ఆమె ప్రకటన చేసే అవకాశముందని చెబుతున్నారు. అది వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఉండవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
వచ్చే ఏడాది కొత్త పార్టీ...
తెలంగాణ జాగృతి ఇప్పటికే ప్రజల్లో బలంగా ఉన్నందున అదే పేరుతో పార్టీ పెడతారన్న ప్రచారం ఊపందుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉండి వచ్చే శాసనసభ ఎన్నికల లక్ష్యంగానే ఆమె కొత్త పార్టీకి రూపకల్పన చేయాలని భావిస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయడం కంటే ఏకంగా శాసనసభ ఎన్నికల బరిలోకి నేరుగా దిగడమే మంచిదన్న భావనలో ఉన్నారు. అందుకోసమే తన ఆమె లీగల్ టీం ఇప్పటికే పార్టీ పేరుతో రిజిస్టర్ చేయించడంతో పాటు ఎన్నికల కమిషన్ ఎదుటకు వచ్చే ఏడాది ఆరంభంలోనే వెళ్లనున్నారని తెలిసింది. ఇందుకోసం అనేక పేర్లను సూచిస్తున్నప్పటికీ తెలంగాణ జాగృతి అన్న పేరు ఉంటేనే బాగుంటుందని నే ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.
అన్ని వర్గాలతో మమేకం అవుతూ...
కల్వకుంట్ల కవిత తన జిల్లాల పర్యటనలో అన్ని వర్గాలతో మమేకం అవుతున్నారు. రైతులు, మహిళలు, బీసీలు ఇలా ఒక వర్గానికి చెందిన పార్టీ అనే ముద్రపడకుండా ఆమె జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే తన తండ్రి కేసీఆర్ ముద్ర కూడా పార్టీపై లేకుండా చూసేందుకు ఆమె ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కేసీఆర్ కు పోటీగా కాదని, తెలంగాణ కోసమేనని ఆమె ప్రజలకు చెప్పే ప్రయత్నంలో ఉన్నట్లు కనపడుతుంది. ముఖ్యంగా ఆమె ఆగ్రహమంతా కేసీఆర్ చుట్టూ ఉన్న నాయకులపైనే ఉంది. అయితే తనను తిరిగి పార్టీలోకి ఆహ్వానించినా తాను వెళ్లనని సన్నిహితుల వద్ద గట్టిగా నొక్కి చెబుతున్నారట. తాను వారి ట్రాప్ లోపడబోనని, తన మార్గం తనకుందని కవిత క్లారిటీ ఇస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద కల్వకుంట్ల కవిత మాత్రం ఒక రోడ్ మ్యాప్ తోనే రాజకీయంగా ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు కనపడుతుంది.
.