Kalvakuntla Kavitha : కవితక్కా.. కొన్నాళ్లే.. ఇప్పుడే మొదటి పేజీల్లో తర్వాత షర్మిల తరహాలోనే
కల్వకుంట్ల కవిత ఇక బయటకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు
కల్వకుంట్ల కవిత ఇక బయటకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. అయితే ఆమె భవిష్యత్ ప్రణాళిక మాత్రం కొత్త పార్టీ అన్నది మాత్రం అర్థమవుతుంది. బీఆర్ఎస్ నాయకత్వం తనపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని కవిత జీర్ణించుకోలేకపోతున్నారు. తన తండ్రి చుట్టూ దయ్యాలున్నాయని, తన తండ్రి దేవుడని అన్నప్పటికీ కేసీఆర్ కుమార్తె విషయంలో వెనక్కు తగ్గలేదు. పార్టీ కోసం కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేశారు. అసలే తనకు పార్టీలో జరుగుతున్న అన్యాయానికి రగిలిపోతున్న కవిత సస్పెన్షన్ తో మరింతగా రగిలిపోతున్నట్లే ఉంది. అందుకే కవిత పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుంది. దీంతో పాటు పార్టీ తనకు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి కూడా త్యజించి జనంలోకి వెళ్లేందుకు సిద్ధమయినట్లు కనిపిస్తుంది.
ఇప్పుడు చేసే విమర్శలకు...
కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ పై యుద్ధం కాకుండా, బీఆర్ఎస్ పార్టీ నేతలపైనే వార్ ప్రకటించేందుకు సిద్ధమయినట్లు కనపడుతుంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా కవిత కొత్త పార్టీ ప్రకటించే అవకాశాలను ఎవరూ కొట్టిపారేయలేరు. తన తండ్రి కేసీఆర్ తనపై సస్పెన్షన్ నిర్ణయాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్నారని ఆమెకు తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సీబీఐ విచారణతో చికాకులో ఉన్న పెద్దాయనను కవిత మరింత చికాకు పెట్టినట్లయింది. అయితే కవిత చాలా రోజులుగా పార్టీపైన, నేతలపైన విమర్శలు చేసినా కేసీఆర్ ఓపిక పట్టారు. పెద్దగా పట్టించుకోనట్లు వదిలేశారు. అయితే కాళేశ్వరం విషయంలో కవిత చేసిన కామెంట్స్ ఆయననే ఇబ్బంది పెట్టాయి.
సొంత పార్టీ పెట్టినా...
కనీసం బంధువులని లేకుండా, పార్టీలో తనకు ముఖ్యులని తెలిసినా కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలతో ఆయన ఇబ్బంది పడ్డారు. అందుకే ఆయన తన భార్యతోనూ చర్చించారు. కుమార్తె అని చూస్తూ ఊరుకుంటే రానున్న ఎన్నికలకు ముందు మరింత మంది నేతలు రెచ్చిపోయే అవకాశాలు లేకపోలేదు. అందుకే కవితను సస్పెండ్ చేసి ఆమె భవిష్యత్ లో చేసే విమర్శలకు ప్రాధాన్యత లేకుండా ప్రస్తుతానికి అయితే చేయగలిగారు. కవిత ఇప్పుడు ఏం మాట్లాడినా ప్రజలు పెద్దగా పట్టించుకోరు. అయితే ఒకటి మాత్రం నిజం. ఏపీలో వైఎస్ షర్మిలను ఎవరూ పట్టించుకునే వారు లేరు. తొలినాళ్లలో ఉన్న క్రేజ్ రానురాను తగ్గిపోయింది. కవిత విషయంలోనూ అదే జరుగుతుంది. సొంత పార్టీ పెట్టినా కల్వకుంట్ల కవిత చేతులు కాల్చుకోవడం తప్ప మరొక ప్రయోజనం ఉండదన్నది వాస్తవం. మరి కవిత తీసుకునే నిర్ణయం ఆమెకే వదిలేసిన్నా.. రాజకీయంగా ఏదో ఒకరోజు మళ్లీ కారు ఎక్కాల్సిందేనని చెప్పక తప్పదు.