Kalvakuntla Kavitha : కవిత ఆరోపణలు క్యాడర్ లైట్ గా తీసుకుంటుందా? మద్దతు దొరకనిది అందుకేనా?
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత చేస్తున్న ఆరోపణలను ఆ పార్టీ నేతలు, క్యాడర్ పెద్దగా పట్టించుకోవడం లేదు
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత చేస్తున్న ఆరోపణలను ఆ పార్టీ నేతలు, క్యాడర్ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇందుకు ప్రధాన కారణం.. తన తండ్రి అమాయకుడని, ఆయనను తప్పుదోవపట్టిస్తున్నాడని చెప్పడమే. ఎందుకంటే కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజల్లో ఒకరకమైన గుర్తింపు ఉంది. కేవలం తెలంగాణ ప్రజల్లో మాత్రమే కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కేసీఆర్ మంచి వ్యూహాలు రచించడంలో దిట్ట అన్న పేరుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కేసీఆర్ ఎవరి మాట వినరని కూడా అంటారు. అలాంటి కేసీఆర్ కు తెలియకుండా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవిత చేస్తున్న విమర్శలు పెద్దగా పార్టీ నేతలకే కాదు.. ఆమె పక్కన తలాడిస్తున్న వారికి మెదళ్లలోకి కూడా ఎక్కడం లేదు.
ఏ నిర్ణయం తీసుకున్నా...
దీనికి కారణం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆయన సొంతంగానే తీసుకుంటారు. మంచైనా.. చెడైనా గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆయనకే దక్కుతుంది. గెలిచినప్పుడు క్రెడిట్ కానివ్వండి.. ఓడినప్పుడు ఆయనే కారణమని అనుకోవడం కానివ్వండి అంతా కేసీఆర్ చుట్టూ మాత్రమే బీఆర్ఎస్ తిరుగుతూ ఉంటుంది. నాడు ప్రగతి భవన్ లోకి మంత్రులకు కూడా ప్రవేశం ఉండని స్థితిలో కానీ కల్వకుంట్ల కవిత ఆ విషయాన్ని విస్మరించి మాట్లాడుతున్న తీరు పెద్దగా తెలంగాణ ప్రజల్లోకి ఎక్కడం లేదన్న కామెంట్స్ బలంగా వినపడుతున్నాయి. నిన్న చింతమడకలోనూ కేసీఆర్ తో పాటు తన సోదరుడు కేటీఆర్ పై ప్రశంసలు కురిపించిన కల్వకుంట్ల కవిత హరీశ్ రావుతో పాటు సంతోష్ రావులను పరోక్షంగా టార్గెట్ చేసుకుని మాట్లాడటం చూసిన వారికి ఎవరికైనా ఇదే అర్ధమవుతుంది.
కేసీఆర్, కేటీఆర్ లు కూడా...
కేసీఆర్ రాజకీయ అనుభవమెంత? హరీశ్ రావు, సంతోషర్ రావు పొలిటికల్ ఎక్స్ పీరియన్స్ ఎంత? కేసీఆర్ కు కవితపైన కాని, నిజామాబాద్ లో ఆమెను ఓడించాలని కానీ వీరిద్దరూ ప్రయత్నించి ఉంటే ఆ విషయం వెంటనే కేసీఆర్ కు తెలిసిపోతుంది. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలోనూ కేసీఆర్ కు సన్నిహితులున్నారు. అందుకే కవిత ఆరోపణలు కేవలం కుటుంబపరమైన సమస్యలుగానే తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. మా నాయన బంగారం.. పక్కనున్నోళ్లు మచ్చ తెస్తున్నారంటూ కల్వకుంట్ల కవిత చేస్తున్న విమర్శలు మాత్రం ఎబ్బెట్టుగానే అనిపిస్తున్నాయి. అందుకే కవిత ఆరోపణలను పెద్దగా పట్టించుకోని కేసీఆర్ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సోదరుడు అన్న కూడా దూరం పెట్టారన్నది పార్టీ నేతలు, క్యాడర్ నుంచి వినిపిస్తున్న మాట.