Weather Report : ఫిబ్రవరి మొదటి వారంలోనే దంచి కొడుతున్న ఎండలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువయ్యాయి.

Update: 2026-02-07 04:17 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉక్కపోత వాతావరణం మొదలయింది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఎండల తీవ్రత మొదలయింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఫిబ్రవరి రెండో వారం నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. అయితే ఒక వారం ముందుగానే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి గాలులు కూడా వీస్తున్నాయి. ఫిబ్రవరి మొదటివారంలో ఎండల తీవ్రత ఇలా ఉంటే... రానున్న రోజుల్లో మరెంతగా ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతాయన్న ఆందోళన రెండు రాష్ట్రాల ప్రజలలో వ్యక్తమవుతుంది.

ఉక్కపోత కూడా...
ఆంధ్రప్రదేశ్ లో సహజంగానే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తీర ప్రాంతం కావడంతో ఉక్కపోత కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలతో ఈసారి మాడు పగిలిపోతుందన్న భయం అందరిలోనూ కనపడుతుంది. ప్రధానంగా కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఈ జిల్లాల్లో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో నేడు పొడి వాతావరణం నెలకొని ఉంటుందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. ఏజెన్సీ ఏరియాలయిన మినుములూరు, అరకు, పాడేరులో మాత్రం సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
సాధారణం కంటే...
తెలంగాణలోనూ చలిగాలులు పూర్తిగా కనుమరుగై పోయాయి. చలితీవ్రత పూర్తిగా తగ్గింది. గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో హైదరాబాద్ వంటి నగరంలోనూ గత ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా కనిపించింది. దాదాపు నలభై నుంచి నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈసారి అంతకంటే ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇప్పటికే ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.


Tags:    

Similar News