... Telangana : కేసీఆర్ .... కుస్తీ..కంటే దోస్తీ మేలనుకుంటున్నారా?
తెలంగాణలోనూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కమలం పార్టీతో దోస్తీకి సిద్ధమయ్యే అవకాశాలున్నాయి
ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీలో జోష్ పెరిగింది. బీజేపీ అండ లేకపోతే గెలవడం అసాధ్యమన్న భావన ప్రతి ప్రాంతీయ పార్టీలో పడిపోయింది. అందుకే తెలంగాణలోనూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కమలం పార్టీతో దోస్తీకి సిద్ధమయ్యే అవకాశాలున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ను నిలువరించాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం మినహా మరొక మార్గం కేసీఆర్ కు కనిపించడం లేదు. కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తే రాజకీయంగా తమ పార్టీకి ఇబ్బందులు తప్పవని గులాబీ పార్టీ బాస్ కు అర్థమవుతుంది. అందుకే ఢిల్లీ బీజేపీ నేతలతో ఆయన టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. దక్షిణాదిన కూడా బీజేపీ బలం పెంచుకోవాల్సి ఉండటంతో ఇక్కడ కేసీఆర్ మద్దతు అవసరం అని భావిస్తుంది.
జరుగుతున్న పరిణామాలు...
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేఖ రాయడంతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి పలువురు కేంద్ర మంత్రులను కలసి రావడంకూడా ఈ చర్చకు దారితీస్తుంది. తెలంగాణలో బీఆర్ఎస్ కు బీజేపీ, కాంగ్రెస్ లు రెండూ శత్రువులయినప్పటికీ కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వస్తే తమకు ఇబ్బందులు తప్పవని ఆయన ఒక క్లారిటీకి వచ్చారు. అందుకే ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. ఒక్కసారి కాంగ్రెస్ నుదెబ్బకొట్టడం కేసీఆర్ లక్ష్యంగా ఉంది. బీజేపీ టార్గెట్ కూడా అదే కావడంతో వచ్చే ఎన్నికల నాటికి ఇద్దరి మధ్య పొత్తులు కుదిరే అవకాశాలున్నాయన్న అంచనాలు వినపడుతున్నాయి.
ఎన్నికలకు ఇంకా...
ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ అధికస్థానాలు తాము తీసుకుని పాలనను పంచుకోవడానికి బీజేపీకి ఎటువంటి ఇబ్బందులు లేవు. అదే సమయంలో కాంగ్రెస్ ను అణగదొక్కడానికి బీఆర్ఎస్ కు కూడా అంతకు మించి మార్గం లేదు. బీజేపీ బలపడితే జరిగే నష్టం తమకేనని భావిస్తున్న కేసీఆర్ బీజేపీకి దగ్గరవుతున్నట్లు చెబుతున్నారు. చుట్టుముడుతున్న కేసులతో పాటు పార్టీ నేతలు జెండాను వదలి పెట్టి పోకుండా ఉండాలంటే కమలంతో దోస్తీకి సై అని అనక తప్పేట్లు లేదు. అందుకే కేసీఆర్ కూడా పెద్దగా రాజకీయాలను పట్టించుకోవడం లేదని, తాను ఢిల్లీకి వెళ్లి, ఇక్కడ బీజేపీ వచ్చినా తనకు ఇబ్బందులు లేవన్న ఆలోచనకు ఆయన వచ్చినట్లు చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?