Telangana : వరదల్లోనూ ఓట్లు వెతుక్కోవాల్సిందేనా? ఇదేమి రాజకీయం?

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా క్లౌడ్ బరస్ట్ జరిగింది. నేతలు వరదలోనూ రాజకీయాలను వెతుక్కుంటున్నారు

Update: 2025-08-28 11:55 GMT

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా క్లౌడ్ బరస్ట్ జరిగింది. మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. అయితే నేతలు వరదలోనూ రాజకీయాలను వెతుక్కుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యమంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలు రాజకీయ పరమైనవేనని చెప్పాలి. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలను ఎవరూ అడ్డుకోలేరు. అందులోనూ జలప్రళయాన్ని ఎవరూ ఆపలేరు. అధికారంలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ ఉన్నప్పటికీ సహాయక చర్యలు చేపట్టాలంటే అందుకు అనువైన పరిస్థితులుండాలి. రాజకీయ నేతలు ఎవరూ సహాయక చర్యల్లో పాల్గొనరు. వాళ్లు కేవలం ఆదేశాలు జారీ చేయడం మాత్రమే.

భారీగా పంట నష్టం...
కానీ వరదల్లో చిక్కుకుపోయిన వారిని సురక్షితమైన ప్రాంతాలకు చేర్చేది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది మాత్రమేనని గుర్తుంచుకోవాలి. కానీ అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండానే మెరుపు వరదలు వెళ్లిపోయాయి. అయితే భారీగా పంట నష్టం జరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా వద్ద తీరం దాటడంతో కొంత ఊపిరిపీల్చుకున్నట్లయింది. జాతీయ రహదారులే కొట్టుకుపోయాయి. రైల్వే ట్రాక్ కూడా దెబ్బతినింది. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు మానుకుని బాధితులకు అవసరమైన మేరకు సాయం అందించాల్సిన పరిస్థితుల్లో పార్టీ నేతల రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఏవగింపును కలిగిస్తున్నాయంటున్నారు.
నాడు కూడా...
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ గోదావరి ఉప్పొంగి భద్రాచలం నీటమునిగింది. మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో కూడా చాలా ఆస్తి నష్టం, పంట నష్టం జరిగింది. నాడు కూడా రాజకీయ నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రులు వరద తగ్గిన తర్వాత మాత్రమే ఆ ప్రాంతాల్లో పర్యటించగలిగారు. వారికి భరోసా ఇవ్వగలిగారు. ఇప్పుడైనా జరిగిన పంట నష్టం అంచనా వేసిన తర్వాత రైతులందరికీ సాయం చేయాలని, నష్ట పరిహారం అందించాలని విపక్షాలు కోరడంలో తప్పులేదు. అంతేకాని భారీ వర్షం కురుస్తున్న సమయంలోనే ప్రభుత్వ వైఫల్యం అంటూ ఎక్స్ లో పోస్టులు పెట్టడం ఎంత వరకూ సబబని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికార, విపక్ష పార్టీలు వరదలపై రాజకీయ విమర్శలు మానుకుని బాధితులకు తక్షణ సాయం అందించడంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.


Tags:    

Similar News