Indiramma Houses : గుడ్ న్యూస్...నేటి నుంచి రెందో దశ ఇందిరమ్మ ఇళ్ల అనుమతి పత్రాలు మంజూరు
ఇందిరమ్మ పథకం లబ్దిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
ఇందిరమ్మ పథకం లబ్దిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించిన పత్రాలను అందచేయనుంది. నేటినుంచి అర్హులైన లబ్దిదారులకు రెండో దశ లో ఇళ్ల మంజూరు పత్రాలను అందచేయనుంది. తొలిదశ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. బేస్ మెంట్ వేసుకున్న వారికి లక్ష రూపాయలను కూడా ప్రభుత్వం తొలివిడతగా మంజూరు చేసింది. ఒక్కొక్క ఇందిరమ్మ ఇంటికి ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇంటి నిర్మాణం పూర్తయ్యే దశలను అనుసరించి వారికి విడతల వారీగా నిధులను మంజూరు చేయనుంది. తొలి దశలో నలభై ఏడు వేల మంది లబ్దిదారులకు మంజూరు పత్రాలు జారీ చేయడంతో వారు పనులను కూడా ప్రారంభించారు.
రెండో దశలో
ఇక మొదటి దశ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమవుతుండగానే రెండో దశలో లబ్దిదారుల ఎంపికను కూడా ప్రభుత్వం పూర్తి చేసింది. దాదాపు రెండు లక్షల మంది లబ్దిదారులను ఎంపిక పూర్తి చేసినట్లు తెలిసింది. దీంతో అర్హత ఉన్న వారిలో దాదాపు లక్షమందికి నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన అనుమతి పత్రాలను మంజూరు చేసే అవకాశముంది. ఇన్ ఛార్జి మంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా లబ్దిదారులకు ఇళ్లకు సంబంధించిన మంజూరు పత్రాలను జారీ చేయనున్నారు. వీరికి త్వరగా తమ ఇళ్ల నిర్మాణ పనులను మొదలు పెట్టాలని, బేస్ మెంట్ పనులు పూర్తి అయిన వెంటనే లక్ష రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది.
బేస్ మెంట్ పూర్తి చేసుకున్న వారికి...
ఇప్పటి వరకూ బేస్ మెంట్ వరకూ పూర్తి చేసుకున్న లబ్దిదారులకు లక్ష రూపాయలు సాయం అందించడంతో వారు గోడల నిర్మాణాన్ని కూడా చేపట్టారు. బేస్ మెంట్ పనులు పూర్తి చేసిన మరికొందరికి కూడా నేటి నుంచి లక్ష రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందచేయనుంది. కొందరు గోడలకు ప్లాస్టింగ్ కూడా పూర్తి చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. త్వరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేత గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతంగా పూర్తి చేసుకోవాలని, ఎప్పటికప్పడు అధికారుల పర్యవేక్షించి అందుకు సంబంధించిన నిధులను మంజూరు చేస్తారని ప్రభుత్వం చెబుతుంది.