ఏయే బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఏ ఐడీ ఉండాలి?

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు

Update: 2023-12-08 12:07 GMT

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు డిసెంబర్ 9వ తేదీ శనివారం మధ్యాహ్నం నుండి బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. బాలికలు, మహిళలు, ట్రాన్స్‌ జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మాత్రమే మహిళల ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 8న ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఆర్టీసీ విధి విధానాలు రూపొందించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇదొకటి. మహిళల వయసుతో సంబంధం లేదని.. చిన్నారులు, బాలికలకు కూడా ఫ్రీ జర్నీ అని ఆర్టీసీ చెబుతోంది. తెలంగాణలో ఎక్కడైనా తిరగొచ్చని.. ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు చూపించాలని తెలంగాణ ఆర్టీసీ తెలిపింది.

రాష్ట్ర ప‌రిధిలో తిరిగే ప‌ల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం క‌ల్పించారు. సిటీలో ఆర్డిన‌రీ, ఎక్స్‌ప్రెస్ బ‌స్సుల్లో ఉచితంగా ప్ర‌యాణించొచ్చు. ఇక మ‌హిళ‌ల‌కు సంబంధించిన ఛార్జి మొత్తాన్ని ఆర్టీసీకి ప్ర‌భుత్వం చెల్లించ‌నుంది. త్వ‌ర‌లోనే మ‌హిళ‌ల‌కు మ‌హాల‌క్ష్మి స్మార్ట్ కార్డుల‌ను అందించ‌నుంది ప్ర‌భుత్వం. మొద‌టి వారం రోజుల పాటు ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండానే మ‌హిళ‌ల‌కు ప్ర‌యాణించే వెసులుబాటు క‌ల్పించారు.


Tags:    

Similar News