BRS : స్థానిక యుద్ధంలో కారు స్పీడ్ అందుకోలేదా? బ్రేకులు తప్పవా?
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంత మేరకు విజయం సాధిస్తుందన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో హట్ టాపిక్ గా మారింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంత మేరకు విజయం సాధిస్తుందన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో హట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు కావస్తుంది. ఈ రెండేళ్ల పాలనపై కాంగ్రెస్ పనితీరుపై ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారన్న విషయం ఈ ఎన్నికల ద్వారా స్పష్టమవుతుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు ఒక అడ్వాంటేజీ ఉంది. అదేమంటే అధికారంలో ఉండటంతో బలం, బలగానికి సంబంధించి మాత్రమే కాకుండా అన్ని విషయాల్లో అది ముందుకు వెళ్లే అవకాశముంది. కానీ బీఆర్ఎస్ విషయంలో అలా చూడలేం. గత రెండేళ్లుగా బీఆర్ఎస్ ప్రతిపక్షంగా పెద్దగా సక్సెస్ ఫుల్ గా పనిచేయలేదన్న విమర్శలు బాగా వినిపిస్తున్నాయి.
ఫామ్ హౌస్ కే పరిమితమయి...
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల్లో ఓటమి పాలయిన నాటి నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఆయన అప్పుడప్పుడు జనంలోకి వచ్చినా అది పార్లమెంటు ఎన్నికల సందర్భంగానే. ఇక గులాబీ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరిగి కొన్నినెలలు గడిచాయి. వరంగల్ లో జరిగిన భారీ బహిరంగ సభలో ఇకపై జనంలోనే ఉంటానని కేసీఆర్ చెప్పారు. ఏప్రిల్ లో జరిగిన ఈ బహిరంగ సభ తర్వాత కేసీఆర్ జనంలోకి వచ్చింది లేదు. ఎక్కడా కార్యక్రమాల్లో పాల్గొనింది లేదు. ఆయన చెప్పిన మాట మీద నిలబడడు అనడానికి ఇది ఉదాహరణ అని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. సిల్వర్ జూబ్లీ సభ జరిగిన తర్వాత ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ అధినేత గళం విప్పకపోవడాన్నికూడా కొందరు తప్పుపడుతున్నారు.
రెండుగా చీలడంతో...
ఇక అదేసమయంలో బీఆర్ఎస్ లోనూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవితల మధ్య ఆధిపత్య పోరు కూడా ప్రజల్లో పార్టీని పలుచన చేసింది. పార్టీ క్యాడర్ లోనూ అయోమయం నెలకొంది. ఎవరు అవునన్నా, కాదన్నా పార్టీలో రెండు గ్రూపులు అయితే ఉన్నాయన్నది కవిత రాస్తున్న లేఖల ద్వారా బయటపడుతుండటంతో నవ్వులపాలయింది కారు పార్టీ. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలనుకున్నా ముందు ఫ్యామిలీ సర్కస్ మాటేమిటని ప్రత్యర్థులు ప్రశ్నించే అవకాశముంది. అలాగే ఇప్పుడు రెండు గ్రూపులు కారు పార్టీలో బహిరంగంగా సవాళ్లు విసురుకుంటుండటంతో క్యాడర్ లో కూడా నిరుత్సాహం నెలకొంది. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కారు ఎలా ముందుకు వెళుతుందన్నది చూడాల్సి ఉంది. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ వెళ్లినా ఫలితం ఎంత మేరకు కనిపిస్తుందన్నది ఆ పార్టీ నేతలకు మింగుడపడటం లేదు.