బంజారాహిల్స్ భూ వివాదంలో మాజీ ఎంపి టీజీ వెంకటేశ్ పై కేసు
తాజాగా సిద్ధం చేసిన రిమాండ్ రిపోర్ట్ లో మాజీ ఎంపి టీజీ వెంకటేశ్ ను ఏ5 నిందితుడిగా చేర్చారు. ఈ రిమాండ్ రిపోర్టులో..
హైదరాబాద్ : సీనియర్ రాజకీయ వేత్త, ప్రముఖ పారిశ్రామిక వేత్త, రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ పై బంజారాహిల్స్ భూ వివాదం విషయంలో పోలీస్ కేసు నమోదైంది. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ పరిధిలోని బంజారాహిల్స్‌కు చెందిన ఏపీ జెమ్స్ అండ్ జ్యువెల్లర్స్ కు చెందిన స్థలాన్ని కబ్జా చేసేందుకు టీజీ సోదరుడు మందీ మార్బలంతో వచ్చారంటూ వార్తలొచ్చాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే 60 మందికి పైగా నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్ రిపోర్ట్ ను సిద్ధం చేశారు.
తాజాగా సిద్ధం చేసిన రిమాండ్ రిపోర్ట్ లో మాజీ ఎంపి టీజీ వెంకటేశ్ ను ఏ5 నిందితుడిగా చేర్చారు. ఈ రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలను పొందుపరిచినట్లు తెలుస్తోంది. అతని సోదరుడు టీజీ విశ్వప్రసాద్, సుభాష్ పులిశెట్టి, మిథున్, వీవీఎస్ శర్మ సహా 80 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. రిమాండ్ రిపోర్ట్ ప్రకారం.. ఏపీ జెమ్స్ అండ్ జ్యువెల్లరీ పార్క్ స్థలంలో 80 మంది నిందితులు అక్రమంగా ప్రవేశించారు. జేసీబీలు, హాకీ స్టిక్‌లతో చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఏపీ జెమ్స్ అండ్ జ్యువెల్లరీ పార్క్‌లోని ఆ సంస్థ ప్రాపర్టీని ధ్వంసం చేసేందుకు యత్నించారు. అడ్డుకున్న సిబ్బందిపై దాడి చేశారు. పీపుల్ టెక్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారే దాడి చేశారని ఏపీ జెమ్స్ అండ్ జ్యువెల్లరీ పార్క్ సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు.