Revanth Reddy : నడుమిరిగి ఫాంహౌస్ లో పడుకున్నోడితో నాకు శత్రుత్వం ఏంటి?
బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జడ్చర్లలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పాలమూరు ప్రాజెక్టును కూడా గతంలో కాంగ్రెస్ నేతలు సాధించారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే పాలమూరు - రంగారెడ్డి పథకం పనులు వేగవంతం అయ్యాయని అన్నారు. వేల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్లు దండుకుందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించామని తెలిపారు. తనకు రాజకీయం తెలసునని, వ్యూహలు, ఎత్తుగడలు అన్నీ తెలుసనని, ఎవరు ఏ రూపంలో వచ్చినా వారిని అడ్డుకుంటానని రేవంత్ రెడ్డి అన్నారు.
చర్చించాలని సవాల్ విసిరినా...
శుక్రాచార్యుడు ఫాం హౌస్ లో కూర్చుంటే మారీచుడు, సుబాహువు అసెంబ్లీకి వస్తున్నారని అన్నారు. మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయని గుర్తు చేశారు. పాలమూడు బిడ్డ సీఎం కావడానికి ఆయన మనసు అంగీకరించలేదని తెలిపారు. ఉద్దండపూర్ రైతులకు పరిహారం ఇచ్చి రైతులకు సాయం చేశారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రాజెక్టులపై అసెంబ్లీకి వచ్చి చర్చించాలని తాము సవాల్ విసిరినా సభకు రాకుండా ఎగ్గొట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ మంజూరు చేసిన ఒక్క ప్రాజెక్టు అయినా ఈ జిల్లాలో ఉందా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పాలమూరు జిల్లాను బీఆర్ఎస్ అన్యాయం చేసిందని చెప్పారు. నేడు గొప్పలు చెబుతున్న నేతలు నాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని కేసీఆర్ ను ప్రశ్నించారా? అని రేవంత్ రెడ్డి నిలదీశారు.
నాడు పడావ్ పెట్టిన ప్రాజెక్టులకు నేడు...
నాడు పడావ్ పెట్టిన ప్రాజెక్టులు నేడు ప్రజలకు ఉపయోగ పడేలా చేస్తున్నామని తెలిపారు. ప్రతి రెండు మూడు నెలలకు తాను ఇక్కడకు వస్తుంటానని, ఎన్నికల తర్వాత రాజకీయాలు లేవని, కేంద్రంతో సఖ్యతతో కొనసాగుతామని, విభేదాలు పెట్టుకోబోమని, తద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. మోదీని తాను పదే పదే కలుస్తున్నానంటే అందుకు అభివృద్ధి కోసమో, నిధుల కోసమేనని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్నికల్లో రాజీ అయ్యేది లేదని, అలాగే అభివృద్ధిలో కూడా రాజీ పడబోమని అన్నారు. నడుమిరిగి ఫామ్ హౌస్ లో పడుకున్నోడిని తాను శత్రువునని ఎలా అనుకుంటానని, ఆయన నిటారుగా లేచి నిలబడి తన మీదకు వచ్చినప్పుడు కదా? శత్రువుగా చూసేది అని రేవంత్ రెడ్డి కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు.