Telangana : నేటి నుంచి ఎన్నికల కోడ్.. స్థానిక సంస్థల ఎన్నికలకు మోగిన నగరా
తెలంగాణలో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది. స్థానిక సంస్థల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాణికుముదిని విడుదల చేశారు.
తెలంగాణలో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది. స్థానిక సంస్థల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాణికుముదిని విడుదల చేశారు. రిజర్వేషన్లకు సంబంధించి నిన్న సాయంత్రమే గెజిట్లు విడుదల జరిగిందని ఎస్‌ఈసీ రాణికుముదిని తెలిపారు. తెలంగాణలోని అన్ని జిల్లాలు, మండలాల్లో రిజర్వేషన్ల ఖరారు జరిగిందని చెప్పారు. తెలంగాణలోని 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహణ చేపట్టనున్నట్లు ప్రకటించారు. 5,749 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. 565 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని ఎస్‌ఈసీ రాణికుముదిని తెలిపారు.
షెడ్యూల్ ఇదే...
స్థానిక సంస్థల ఎన్నికలకు 1.12 లక్షల పోలింగ్ స్టేషన్లను గుర్తించామన్న రాణికుమిదిని అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరణ కార్యక్రమం ఉంటుందన్నారు.తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 27న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రెండో విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 17న సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కానుంది. సర్పంచ్ ఎన్నికలకు అక్టోబర్ 31 న తొలి విడత పోలింగ్ జరగనుంది. రెండో విడత పోలింగ్ నవంబరు్ నాలుగో తేదీన, మూడో విడత నవంబరు 8వ తేదీన నిర్వహించనున్నారు. పోలింత్ పూర్తయిన తర్వాత అదే రోజు గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నవంబరు 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 12,733 పంచయతీలకు, 1,12,288 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.