Telangana : తెలంగాణలో భారీ వర్షాలు.. మొంథా తుపాను ఎఫెక్ట్
తెలంగాణలో మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణలో మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు కోరుతున్నారు. అనేక చోట్ల వాగులు, వంకలు ప్రవహిస్తుండటంతో ప్రయాణాలు ప్రమాదకరంగా మారనున్నాయని అధికారులు వెల్లడించారు. ఎవరూ నదులు, వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. కార్తీక మాసాల స్నానాల కోసం కూడా నదుల్లోకి దిగవద్దని తెలిపారు.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు...
ఈరోజు నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, కొమరం భీం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. నేడు సూర్యాపేట జిల్లాలో స్కూళ్లకు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సెలవు ప్రకటించారు. రేపు కూడా వర్షం పడే అవకాశముందని తెలిపింది.
తుపాను బలహీన పడినా...
మొంథా తుపాను బలహీనపడుతూ తెలంగాణ మీదుగా ఛత్తీస్ గఢ్ కు వెళుతుండటంతో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మోంథా తుపాను బలహీన పడినప్పటికీ భారీ వర్షాలు పడతాయని తెలిపింది. మోంథా తుపాను ప్రభావం తెలంగాణ జిల్లాలపై కూడా పడుతుందని ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. నిన్నటి నుంచే హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు అంతా వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.