Telangana : కామారెడ్డి పై ఎన్నో ఆశలు.. హస్తం పార్టీ అంచనాలు అవేనా?

కామారెడ్డిలో కాంగ్రెస్ సభ ఈ నెల 15వ తేదీన జరగనుంది.

Update: 2025-09-07 12:17 GMT

కామారెడ్డిలో కాంగ్రెస్ సభ ఈ నెల 15వ తేదీన జరగనుంది. బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఈ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి దాదాపు లక్ష మంది హాజరయ్యేలా చూడాలని ఇప్పటికే స్థానిక నేతలకు ఆదేశాలు అందాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండటంతో బీసీ ఓటు బ్యాంకు టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ ఈ సభను పూర్తిగా విజయవంతం చేయాలని నిర్ణయించింది. బీసీల మద్దతను వీలయినంత వరకూ పొందగలిగితే ఇక తమకు లోకల్ ఎన్నికల్లో తిరుగుండదని కాంగ్రెస్ పార్టీ అంచనా వేసింి.

ఈ నెల 15వ తేదీన...
అందులో భాగంగానే ఈ నెల 15వ తేదన కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభను నిర్వహించాలని తలపెట్టింది. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేసింది. వేదిక ఏర్పాటుతో పాటు జనసమీకరణపై కూడా మంత్రులు కామారెడ్డిలో పర్యటించి అక్కడి నేతలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలను కూడా ఆహ్వానించనున్నారు. కామారెడ్డికి సమీపంలో ఉన్న నియోజకవర్గాల నుంచి అత్యధిక సంఖ్యలో జనాన్ని తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో...
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీలు క్రియాశీలకంగా మారతారు. అదే సమయంలో వారికి తగిన ప్రాధాన్యత కల్పించామన్న విషయం జనంలోకి వెళ్లాలి. అది వెళ్లగలిగితే బీసీ ఓటు బ్యాంకు మాత్రం తమకు అనుకూలంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే ఈ కామారెడ్డి సభను ఏర్పాటు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలోనే సభ పెట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేసింది. నాడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పోటీ చేశారు. అయితే ఆయన గెలవలేదు. అయినా సరే డిక్లరేషన్ చోటనే తాము బీసీ రిజర్వేషన్లు అమలు చేశామని చెప్పేందుకు కామారెడ్డిని ఎంచుకుంది. కులగణన చేయడంతో పాటు దాని ఆధారంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను తెచ్చామని చెప్పుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంంది. మరి ఈ కామారెడ్డి సభతో బీసీ ఓటు బ్యాంకు చేరువవుతుందా? లేదా? అన్నది చూడాలి.



Tags:    

Similar News