మంటలు పుట్టిస్తున్న కాంగ్రెస్‌ తొలి జాబితా

కర్నాటక ఫార్ములా అమలు చేశారు.. బీజేపీ ప్లాన్‌ను ఫాలో అయ్యారు. ఎట్టకేలకు విజయవంతంగా మొదటి జాబితాను విడుదల చేశారు..

Update: 2023-10-16 10:55 GMT

కర్నాటక ఫార్ములా అమలు చేశారు.. బీజేపీ ప్లాన్‌ను ఫాలో అయ్యారు. ఎట్టకేలకు విజయవంతంగా మొదటి జాబితాను విడుదల చేశారు. అయితే మొదటి జాబితా ఇప్పుడు తెగ మంటలు రేపుతోంది. ఆ చిచ్చుతో ఏకంగా గాంధీ భవన్‌కే తాళం వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ కాంగ్రెస్‌ తొలి జాబితా.. ఎందుకంత మంటలు రేపింది? అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాన్నే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అమలు చేస్తోంది. తెలంగాణలో తనకున్న ముగ్గురు ఎంపీలను అసెంబ్లీ బరిలోకి దింపింది. టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి కొడంగల్‌ నుంచి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచి, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హుజూర్‌ నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. 55 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను కాంగ్రెస్‌ అధిష్టానం విడుదల చేసింది.

సిట్టింగ్‌ ఎమ్మెల్యేలుగా ఉన్న ఐదుగురు తమ తమ స్థానాల్లో తిరిగి పోటీ చేయనున్నారు. మధిర నుంచి భట్టి విక్రమార్క, భద్రాచలం నుంచి పొదెం వీరయ్య, ములుగు నుంచి సీతక్క, మంథని నుంచి శ్రీధర్‌ బాబు, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి జగిత్యాల టికెట్‌ కేటాయించింది కాంగ్రెస్‌ అధిష్టానం..

ఒక కుటుంబానికి ఒకే టికెట్‌ అనే విధానానికి కాంగ్రెస్‌ చెల్లుచీటి ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఎంపీ ఉత్తమకుమార్‌ రెడ్డికి హుజూర్‌ నగర్‌ టికెట్‌ కేటాయించిన కాంగ్రెస్‌ పార్టీ ఆయన భార్య పద్మావతిని కోదాడ నుంచి బరిలోకి దింపనుంది. అలాగే ఈ మధ్యే అధికార బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి హనుమంతరావు తన పంతం నెగ్గించుకున్నారు. మైనంపల్లి హనుమంతరావుతో పాటు ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్‌ రావుకు కూడా కాంగ్రెస్‌ టికెట్లు‌ కేటాయించింది. సిట్టింగ్ స్థానం మల్కాజ్‌గిరి నుంచి కాంగ్రెస్‌ తరపున మైనంపల్లి హనుమంతరావు ఈసారి పోటీ చేయనున్నారు. ఆయన కుమారుడు డాక్టర్‌ రోహిత్‌ రావు మెదక్‌ నుంచి పోటీ చేయనున్నారు.
సీఎం కేసీఆర్‌ సిట్టింగ్‌ స్థానం గజ్వేల్‌లో తూంకుంట నర్సారెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇచ్చింది. సీనియర్‌ నేత జానారెడ్డి కుమారుడు జయవీర్‌కు నాగార్జునసాగర్‌ టికెట్‌ కేటాయించింది. ముషీరాబాద్‌ స్థానం నుంచి కుమారుడి పోటీ చేయించాలని మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ భావించినా పార్టీ నాయకత్వం మాత్రం అంజన్ కుమార్‌నే రంగంలోకి దింపింది. అయితే కొందరు ఫస్ట్‌ లిస్ట్‌లో పేరు రాని వారు సెకండ్‌ లిస్ట్‌ కోసం ఎదురు చూస్తున్నారు.


Tags:    

Similar News