Telangana : మీనాక్షి అయినా పార్టీని సెట్ చేస్తారా?
తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వచ్చిన అధికారాన్ని నిలుపుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది
తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వచ్చిన అధికారాన్ని నిలుపుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఎన్నికల సమయంలో ఎన్నో గ్యారంటీలు ఇచ్చి ప్రజల మన్ననలను పొంది అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన ఏడాది గడుస్తుంది. ఇప్పటికే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కొన్నింటిని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది. మరికొన్ని హామీలను అమలు చేయడానికి సిద్ధమవుతుంది. ఖజానా సహకరించకపోవడంతో కొన్ని హామీలను పెండింగ్ లో పెట్టింది. కొంత కుదురుకున్నాక తెలంగాణలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని ఆ పార్టీ భావిస్తుంది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది.
నేతల్లో సఖ్యత కొరవడి...
ఈ నేపథ్యంలో నేతల్లో సఖ్యత కొరవడింది. బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినా ఇంకా ప్రభుత్వం కుదురుకోలేదనే అనుకోవాలి. ప్రభుత్వంలో మంత్రుల మధ్య సమన్వయం ఉన్నప్పటికీ మంత్రుల తీరుపై కొందరు ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. తాము చెప్పిన పనులు, తమ నియోజకవర్గానికి సంబంధించిన పనులను చేయడం లేదన్న అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పది మంది ఎమ్మెల్యేలు రహస్య సమావేశమై ఒక మంత్రి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా తమకు నచ్చిన వారికి పదవులు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
ఏకపక్ష నిర్ణయాలు...
ఈ నేపథ్యంలో మొన్నటి వరకూ ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దీపాదాస్ మున్షీ పై నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ టిక్కెట్ల కేటాయింపు నుంచి నామినేటెడ్ పోస్టుల భర్తీ వరకూ ఆమె వన్ సైడ్ నిర్ణయాలు తీసుకుంటున్నారని, నేతల మనోభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేతల మధ్య సమన్వయం కుదర్చడంలో దీపాదాస్ మున్షీ విఫలమయ్యారని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. ఏకపక్ష నిర్ణయాలతో మున్షీ వివాదాలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పవర్ సెంటర్ గా కూడా మారరన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి పదవి నుంచి దీపాదాస్ మున్షీని తప్పించి మీనాక్షి నటరాజన్ ను నాయకత్వం నియమించింది. మీనాక్షి నటరాజన్ రాహుల్ కోటరీలో కీలకమైన నేత కావడంతో ఆమె పార్టీని సెట్ చేస్తారంటున్నారు.