బొజ్జల మృతిపై కేసీఆర్ సంతాపం.. ఆత్మీయుడిని కోల్పోయానంటూ భావోద్వేగం
టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు కేసీఆర్ కూడా టిడిపిలో కొనసాగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ..
హైదరాబాద్ : టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శుక్రవారం సాయంత్రం అపోలో ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించారు. బొజ్జల మృతిపట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్... బొజ్జల మృతికి సంతాపం తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. సహచరుడు, ఆత్మీయుడిని కోల్పోయానంటూ కేసీఆర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు.
గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ సీఎం చంద్రబాబు కాబినెట్‌లో ఆయన మంత్రిగా పనిచేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు కేసీఆర్ కూడా టిడిపిలో కొనసాగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పార్టీకి చెందిన పలువురు కీలక నేతలతో కేసీఆర్ అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. అలాంటి నేతల్లో బొజ్జల కూడా ఒకరు. ఈ కారణంగానే బొజ్జల మృతి వార్త తెలియగానే తన ఆత్మీయుడిని కోల్పోయానంటూ కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు.