Telangana : మా ప్రభుత్వం ప్రాధాన్యతలివే.. ఇక హైదరాబాద్ అభివృద్ధిని ఆపేదెవరు?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లలో ఎలాంటి మద్దతు అందలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లలో ఎలాంటి మద్దతు అందలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిపై దృష్టిపెట్టామని తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. తమ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలవడానికి అనేక పథకాలను అమలులోకి తెచ్చిందని తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే పేదలకు సన్న బియ్యం పంపిణీని చేపడుతూ ఆ కుటుంబాల్లో ఆనందం నింపడానికి ప్రయత్నిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు మెట్రో రైలు విస్తరణ ను కూడా చేపట్టనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు.
నిరుద్యోగులకు అవకాశాలు...
నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాలని తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై వేల ఉద్యోగాల నియామకాలను చేపట్టిందని రేవంత్ రెడ్డి చెప్పారు. విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకు వచ్చామని తెలిపారు. నాణ్యమైన విద్యను అందించడానికి అవసరమైన సదుపాయాలను తమ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చామని రేవంత్ రెడ్డి అన్నారు. రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశామని, పెట్టుబడి సాయం అందిస్తున్నామని, అలాగే సన్న బియ్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ను ఇస్తున్నామని చెప్పారు.అన్ని వర్గాల వారికీ నాణ్యమైన వైద్యం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రి తరహాలో నిర్మిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.
అన్ని రంగాల్లో ...
ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. మహిళలకు తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు తమ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రవేశపెట్టామని, ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను అందిస్తున్నామని, రెండు వందల యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందచేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్నుంచి బయటపడి వేగంగా అభివృద్ధివైపు అడుగులు వేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామన్న రేవంత్ రెడ్డి ఎస్సీ రిజర్వేషన్లకు కూడా చట్టబద్ధత కల్పించామని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరాలకు దీటుగా తీర్చిదేద్దేలా ప్రణాళికను రూపొందించుకుంటున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్యూచర్ సిటీ ఏర్పాటుతో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.